గాల్లోనే సాంకేతిక సమస్య.. తిరిగొచ్చిన ఇండిగో విమానం
పుణె: గువాహటికి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య కలకలం రేపింది. 192 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఆదివారం ఉదయం పుణె నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే తిరిగి పుణె విమానాశ్రయానికి చేరుకుంది. టేకాఫ్ అయిన తర్వాత విమానం ల్యాండింగ్ గేర్ (Landing Gear) ముడుచుకోకపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. ఇండిగోకు చెందిన 6E 0623 విమానం పుణె నుంచి గువాహటికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించింది. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control)కు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని తిరిగి పుణెకు తీసుకురావాలని నిర్ణయించారు.
సమాచారం అందుకున్న అధికారులు పుణె విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency Alert) ప్రకటించారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచారు. ల్యాండింగ్ గేర్ పరిస్థితిని పరిశీలించేందుకు విమానం రన్‌వేపై తక్కువ ఎత్తులో ఒకసారి ప్రయాణించింది. ఆదివారం ఉదయం 9.04 గంటలకు విమానం పుణె విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం మూడు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్స్‌ల సహాయంతో విమానాన్ని బే నంబర్ 7కు తరలించారు. విమానంలోని మొత్తం 192 మంది సురక్షితంగా కిందకు దిగారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులను గువాహటికి చేర్చేందుకు బెంగళూరు నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఆందోళన నెలకొన్నప్పటికీ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. 192 మంది క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.