ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాద్‌లో పాడ్‌కార్ ప్రయాణం.. మూడు రూట్లపై సర్వే!
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ప్రాజెక్టు దిశగా మరో అడుగు పడుతోంది. ప్రతిపాదిత మూడు మార్గాల్లో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (HMRL) సిద్ధమవుతోంది. ఎలివేటెడ్ గైడ్వేల నిర్మాణం, పాడ్‌కార్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను అధికారులు పరిశీలించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రాజెక్టు మార్గాల్లో మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి రాయదుర్గం, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా బయోడైవర్సిటీ వరకు మార్గాన్ని పొడిగించే ప్రతిపాదన ఉంది. సర్వే పూర్తయిన తర్వాత ప్రాజెక్టుపై ఆసక్తి చూపే అంతర్జాతీయ సంస్థల నుంచి Bidding ఆహ్వానించనున్నారు.
ఈ పాడ్‌కార్ వ్యవస్థలో రెండు రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐదారుగురు ప్రయాణించే చిన్న వాహనాలను Personal Rapid Transit (PRT)గా, కనీసం 20 మంది ప్రయాణించే వాహనాలను Group Rapid Transit (GRT)గా పరిగణిస్తారు. ఆయా మార్గాల్లో ప్రయాణికుల రద్దీ, Demand ఆధారంగా ఏ విధానం అనుకూలమో నిర్ణయించనున్నారు. సుమారు రూ.3,400 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును Public Private Partnership (PPP) విధానంలో నిర్మించి నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన.
రాయదుర్గం–కూకట్పల్లి, హైటెక్ సిటీ–రాయదుర్గం (నాలెడ్జ్ సిటీ), కొండాపూర్–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మార్గాలతో పాటు బేగంపేట్, నెక్లెస్ రోడ్, రాణిగంజ్, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సెక్రటేరియట్, అసెంబ్లీ ప్రాంతాలను అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం 2050 నాటికి రోజుకు 10 లక్షల మందికి పైగా ఈ వ్యవస్థను వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు విజయవంతం కావాలంటే ప్రయాణికుల ఆదరణ, నిర్వహణ వ్యయం, టికెట్ ధరలు, అందుబాటులో ఉండే సేవలు కీలకం కానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాతే పాడ్‌కార్ ప్రాజెక్టు అమలుపై స్పష్టత రానుంది.