చిన్న సినిమాలను చంపేస్తున్నారు
పాన్ ఇండియా సినిమా ఓ పెద్ద స్కామ్.. అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు!
పాన్ ఇండియా సినిమాల హవాపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Renowned director Anurag Kashyap) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా అనే కాన్సెప్ట్‌ను కేవలం భారీ లాభాల కోసం సృష్టించిన వ్యాపార వ్యూహంగా అభివర్ణించారు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల క్రేజ్ చుట్టూ తిరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో అసలైన కథలు, సృజనాత్మకతకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ వల్ల చిన్న సినిమాలు, Content-Based Movies తీవ్రంగా నష్టపోతున్నాయని వ్యాఖ్యానించారు.
శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఛాయా సాహిత్యోత్సవంలో పాల్గొన్న ఆయన.. సినిమా రంగంలో వస్తున్న మార్పులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం సినిమాను ఒక కళారూపంగా కాకుండా పూర్తిస్థాయి Businessగా చూస్తున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌లో ఒకే రకమైన రుచి ఉన్నట్లే.. బాలీవుడ్ సినిమాలు కూడా ఒకే మూసలో తయారవుతున్నాయని అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాల పోటీ సినిమా పరిశ్రమలోని సృజనాత్మక వాతావరణాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
పాన్ ఇండియా మార్కెట్ విస్తరణ కారణంగా చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోందని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మలయాళ సినిమా ఇండస్ట్రీని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్కడ నటులు, దర్శకులు, నిర్మాతల మధ్య మంచి Teamwork ఉంటుందని, స్టార్డమ్ కంటే కథకు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. భారీ పారితోషికాల కోసం పోటీ పడకుండా అందరూ కలిసి సినిమాను ముందుకు తీసుకెళ్లే సంస్కృతి ఇతర పరిశ్రమల్లోనూ రావాలని ఆకాంక్షించారు.
ఇక ప్రస్తుతం Filmmakersలో భయం పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఏ కథ చెబితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోననే ఆందోళనతో దర్శకులు తమ ఆలోచనలను స్వేచ్ఛగా తెరపై చూపించలేకపోతున్నారని పేర్కొన్నారు. సినిమా రంగం మళ్లీ సృజనాత్మకతకు, ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.