బంగాళాఖాతంలో తుఫాన్
సోమవారం సాయంత్రానికి తుపాను.. నవంబర్ 18 వరకు ప్రమాదకర గాలులు!
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతుండటంతో తుపాను ముప్పు పొంచి ఉంది. సోమవారం సాయంత్రానికి ఇది తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని అంచనా వేయడంతో సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తత పెరిగింది.
ప్రస్తుతం ఈ Weather System వాయవ్య దిశగా కదులుతోంది. తుపానుగా మారిన తర్వాత దాని తీవ్రత, కదలికలు ఎలా ఉంటాయన్నదానిపై వాతావరణ శాఖ నిఘా పెట్టింది. అయితే ఇది ఎక్కడ తీరం దాటుతుంది? ఏ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. తాజా అంచనాల ప్రకారం నవంబర్ 18 వరకు నైరుతి బంగాళాఖాతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
కొత్తగా చేపల వేటకు వెళ్లవద్దని అప్రమత్తం చేశారు. ఎలాంటి Emergency పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. సహాయక చర్యల కోసం నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. తుపాను ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల పరిసర జిల్లాలు, దక్షిణ తమిళనాడులో ఆదివారం, సోమవారం మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా. చెన్నైలో ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి. తుపాను దిశ, తీవ్రతపై అధికారులు నిరంతరం Monitoring చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెలువడే తాజా Weather Updates కీలకం కానున్నాయి.