భారత్ సమ్మిట్లోఇటలీ నేత అనుచిత వ్యాఖ్యలు!
- ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్
- ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ నినాదం
- భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ ప్రశ్న
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా శనివారం ముగిసిన భారత్ సమ్మిట్‌లో(Bharat Summit) కొందరు విదేశీ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. ముఖ్యంగా ఇటలీకి చెందిన యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్(Giacomo Filibecks) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. భారత్‌లో ఓటర్ల జాబితాల నుంచి లక్షలాది పేర్లను తొలగించారని, దీనికి బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ జియాకోమో ఫిలిబెక్ నినాదాలు చేశారు. విదేశీ వ్యక్తులు భారత్‌లోకి వచ్చి ఇక్కడి అంతర్గత వ్యవహారాలపై విమర్శలు చేయడం ఏమిటని బీజేపీ నేతలతోపాటు పలువురు మండిపడుతున్నారు. భారతీయ నాయకులు ఎవరైనా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ దేశాలు ఊరుకుంటాయా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, విదేశీ ప్రతినిధులను పిలిపించి, వారితో భారత రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయిస్తున్నారని కాంగ్రెస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.