ChatGPT అద్భుతం

15-11-2026 | 11:15am

రెండున్నరేళ్ల తర్వాత కుటుంబానికి చేరిన మహిళ!

ఏఐ టెక్నాలజీతో కలిసిన కుటుంబం.. మహారాష్ట్రలో అరుదైన ఘటన!

ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఓ కుటుంబంలో మళ్లీ ఆనందాన్ని నింపింది. రెండున్నరేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన 45 ఏళ్ల మహిళను గూగుల్ సెర్చ్, ChatGPT వంటి Digital Tools సాయంతో గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటన టెక్నాలజీని మానవత్వంతో ఉపయోగిస్తే ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో చూపించింది. పర్భణీ జిల్లాకు చెందిన జులేఖా ముఖీద్ షేక్ మానసిక ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి దూరమయ్యారు. ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ముంబైలోని కోలాబా పోలీసులు, చెంబూరులోని ప్రభుత్వ మహిళా ఆశ్రయ గృహ అధికారుల విజ్ఞప్తి మేరకు కోర్టు ఆదేశాలతో 2024 ఏప్రిల్ 3న ఆమెను సింధుదుర్గ్‌లోని సంవిత ఆశ్రమానికి తరలించారు.

అక్కడ ఆమె కుటుంబ వివరాలు తెలుసుకునేందుకు జీవన్ ఆనంద్ సంస్థ ట్రస్టీ కిసాన్ చౌరే, ఆయన బృందం ప్రత్యేకంగా ప్రయత్నించింది. జులేఖాతో తరచూ మాట్లాడి ఆమె గతం, స్వస్థలం గురించి చిన్నచిన్న వివరాలను సేకరించారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని Google Search, ChatGPT వంటి AI Tools సహాయంతో అన్వేషణ చేపట్టారు. చివరకు ఆమె పర్భణీ జిల్లాకు చెందినవారని గుర్తించారు. అనంతరం అక్కడి నిర్భయ పోలీస్ స్క్వాడ్ సహకారంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొన్నారు.

రెండున్నరేళ్ల తర్వాత ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన జులేఖా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న ఆమె భర్త ముఖీద్ షేక్ నవంబర్ 9న సంవిత ఆశ్రమానికి చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఓపికగా మాట్లాడి సేకరించిన వివరాలకు AI టెక్నాలజీని జోడించడం వల్లే ఈ ప్రయత్నం విజయవంతమైందని కిసాన్ చౌరే తెలిపారు. ఒకవైపు కుటుంబ సభ్యుల నిరీక్షణకు తెరపడగా.. మరోవైపు టెక్నాలజీకి మానవత్వం తోడైతే జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకురావచ్చో ఈ ఘటన నిరూపించింది.

మరిన్ని వార్తలు