వరంగల్ కోటలో పాపన్న శిల్పం!
మొఘల్ చక్రవర్తుల ఆగడాలను ఎదిరించి, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సొంత సైన్యాన్ని నిర్మించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్(Sardar Sarvai Papanna Goud). మొఘలుల ఆధీనంలో ఉన్న చారిత్రక వరంగల్ కోటను జయించిన ఆయన వీరత్వానికి నిదర్శనంగా, కోట పశ్చిమ ద్వారం వద్ద ఓ అరుదైన శిల్పం నేటికీ కొలువై ఉంది. ఈ శిల్పం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్దేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.
కోటపై మెరుపు దాడి: సర్వాయి పాపన్న 1708 ఏప్రిల్ 1వ తేదీన వరంగల్ కోటను జయించారు. అంతకు ముందురోజు అనగా మార్చి 31న 3 వేల మంది కాల్బలం (కాలి నడకన వెళ్లి యుద్ధం చేసే సైనికులు/పదాతిదళం), 500 మంది అశ్వసైన్యంతో కోటగోడల వద్దకు చేరుకుని కాపు కాశారు. కొంతమంది సైన్యం దారులను మూసి కాపుకాసి ఉండగా, మరికొందరు సైనికులు తాళ్లతో కోటగోడల మీదికి చేరుకున్నారు.
కోట తలుపులను బద్దలు కొట్టి సైన్యంతో కలిసి పాపన్న వరంగల్ కోటలోనికి చొరబడ్డారు. కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల పాటు పాపన్న సైన్యం దుకాణాల నుంచి, వ్యాపారుల నుంచి, వరంగల్ వాసుల నుంచి పెద్ద ఎత్తున ధనం, వస్త్రాలను స్వాధీనం చేసుకుంది. వందల మంది ఉన్నత వ్యక్తులను ఖిలాషాపూర్కు తీసుకువెళ్లి కోట లోపల నిర్బంధించారు.
తీసుకువెళ్లిన వారిలో స్త్రీలు, పిల్లలు, వరంగల్ న్యాయాధీశుడు, అతని భార్యాపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లందరినీ నిర్బంధించి, కావలసినంత ధనసేకరణ చేసుకున్నారు పాపన్న. సంపాదించిన ధనంతో పాపన్న తన సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. 700 డబుల్ బ్యారెల్ మస్కట్లు (తుపాకులు), డచ్, ఇంగ్లిష్ వ్యాపారుల దగ్గర కావాల్సిన యుద్ధ సామగ్రిని కొనుగోలు చేశారు. ఈ విజయంతో పాపన్న రాజు హోదాను పొందారు. ఆయనకు పల్లకీ సేవలు, రాజు ప్రత్యేక సైన్యం, ప్రత్యేకంగా గుర్రం ఉండేవి.
శిల్పం విశేషాలు, చరిత్రకారుల విశ్లేషణ
వరంగల్ కోట పడమటి ద్వారం వద్ద కత్తులు, తుపాకీ ధరించిన ఒక వీరుడి శిల్పం ఉంది. కుడిచేత కైజారు (బాకు/కత్తి), ఎడమచేత మస్కట్ తుపాకీ, బొడ్డులో కత్తితో, వీరకాసె పోసి నిల్చున్న ఈ వీరుని శిల్పానికి ఎడమవైపు సిగ, మెడలో కంటె ఉన్నాయి. పెద్ద మీసాలు, భారీకాయంతో కనిపిస్తున్న ఈ శిల్పం ఆనాటి చారిత్రక సందర్భంతో ముడిపడి ఉంది. శిల్ప శైలిని బట్టి 17వ శతాబ్దానికి చెందినదని, ఆనాటి ఆయుధాలు, ఆహార్యాన్ని బట్టి ఈ విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్నదేనని తాము గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.