నాటి జ్ఞాపకాలు.. నేటి క్లబ్‌లు
- సింగరేణికి వన్నె తెచ్చిన చారిత్రిక కట్టడాలు
- బ్రిటీష్ కాలపు సౌఖ్యాలు కరువు
- ఆహ్లాదానికి దూరమవుతున్న కార్మికులు
బెల్లంపల్లి, నవంబర్ ౧౪: సింగరేణి ఆవిర్భావంతో బ్రిటీష్ కాలంలో(Singarenis Historic British-Era) నిర్మించి కట్టడాలు చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం బొగ్గుట్ట ప్రాంతంలో 1889లో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. అప్పటి నుంచే భూగర్భ గనుల ప్రస్థానం మొదలైంది. గనుల విస్తరణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పాకింది. బెల్లంపల్లి, తాండూరులో భూగర్భ గనులు వెలిశాయి. తాండూర్ కోల్ మైన్స్ పేరుతో ఈ బొగ్గు గనులు ఏర్పడ్డాయి.
బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో పదులకొద్దీ భూగర్భ గనులను తవ్వారు. అనుబంధంగా అనేక రకాల విభాగాలను ఏర్పర్చారు. నార్త్ ప్రాంతం నుంచి వచ్చిన అధికారులు సింగరేణిలో చిత్తశుద్ధిగా విధులు నిర్వహించినట్టు పాత తరం కార్మికులు ఇప్పటికీ చెబుతుంటారు. సంక్షేమం, కార్మికులకు సౌకర్యాల కల్పనలో వారి ప్రత్యేకతను కాదనలేం. భూగర్భ గనుల్లో పరిస్థితులు తొలితరం కంటే ఆ తరువాత చాలా మెరుగుపడ్డాయనే చెప్పవచ్చు. గనుల అంతరంగిక పరిస్థితులతో మాత్రం ఈ సౌకర్యాలను పోల్చరాదు. లోనా, పైనా పరిస్థితుల్లో తేడా ఇప్పటి లాగే అప్పుడు కూడా ఉండేది. కొంత నయమన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సింగరేణికి రోల్ మోడల్ ఇల్లందు క్లబ్‌లు
సింగరేణి వ్యాప్తంగా అప్పటి అధికారులు క్లబ్‌లు ఏర్పాటు చేశారు. సింగరేణికి రోల్ మోడల్‌గా ప్రతి ఏరియాలో ఇల్లందు పేరిట క్లబ్, విశ్రాంతి భవనాలు మందమర్రి, రామగుండం, కొత్తగూడెం ప్రాంతాల్లో నెలకొల్పారు. ఆ తర్వాత కొత్తగా వెలిసిన ఏరియాలో కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని క్లబ్‌లు, విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేశారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన వేదికయ్యాయి. స్విమ్మింగ్ పూల్స్, పార్కులు ఆరోగ్యానికి ప్రతీకలు.
కాలనీల్లో వెల్ఫేర్ సెంటర్లు
ఆఫీసర్లతోపాటు కార్మికులకు సైతం కాలనీల్లో దైనందిన కనీస సౌకర్యాలు ఉండేవి. అందులో ఫిట్హెడెడ్ బాత్రూంలు ఏర్పాటు చేశారు. ఈ సామూహిక స్నానపు సముదాయాలల్లోనే కాలకృత్యాలు తీర్చుకునేవారు. వెల్ఫేర్ సెంటర్ల పేరిట క్లబ్బులు ఏర్పాటు చేశారు. ఆండ్రూస్ మెమోరియల్ క్లబ్ (ఏఎంసీ)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న క్లబ్ అప్పుడు నిర్మించినదే. సింగరేణి అధికారి ఆండ్రూస్ స్మారకార్థం ఏఎంసీ క్లబ్‌ను నెలకొల్పారు.
ఇంక్లైన్ బస్తీ, బజాజ్ ఏరియా ప్రస్తుతం (గ్రంధాలయం స్థానం)లో వెల్ఫేర్ సెంటర్ క్లబ్ కూడా అప్పటిదే. శ్రీ కోదండ రామాలయం పక్కన ఉన్న తాండూర్ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీసీఓఏ) పేరుతో క్లబ్‌ను నిర్మించారు. ఇందులో స్పోర్ట్స్ అథ్లెటిక్స్, క్యారం, షటిల్ వంటి క్రీడలు నిర్వహించేవారు. సింగరేణి అధికారుల నిర్వహణ లోపం, సంక్షేమ క్లబ్బులకు పెను శాపంగా పరిణమించింది. ఒకప్పుడు ఆటపాటలతో కనువిందు చేసిన ఈ క్లబ్బుల చిరునామా కనుమరుగైంది.
అప్పటి వరకూ కార్మికుల కుటుంబాల కోసం బ్రిటిష్ అధికారులు నెలకొల్పిన ఫిట్హెడ్ బాత్రూంలు వెల్ఫర్ సెంటర్ క్లబ్‌లు తరువాతి కాలంలో ప్రభుత్వ పాఠశాలలుగా మారిపోయాయి. బజార్ ఏరియాలో వెల్ఫేర్ సెంటర్ క్లబ్లో పాఠశాల ఉండేది.
బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దానిని కూల్చివేసి అక్కడ గ్రంథాలయం నిర్మించారు. టీసీఓఏ క్లబ్ ఫంక్షన్ హాల్‌గా మారి పోయింది. ఏఎంసీ క్లబ్‌ను తొలుత పోలీస్‌స్టేషన్, ప్రత్యేక పోలీసు దళాల బ్యారక్ ఏర్పాటు చేశారు. ఇటీవలనే క్లబ్ ను కూల్చివేసి ఆ స్థలంలో పోలీసులకి బ్యాడ్మింటన్, షటిల్ కోర్టు నిర్మించారు. కార్మిక కుటుంబాల వినోదం కోసం ఆ క్లబ్ లో సినిమాలు ప్రదర్శించే వారు. క్లబ్‌ను పోలీస్టేషన్‌కు కేటాయించడంతో అప్పటి నుంచి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలు దూరమయ్యారు.
మసకబారుతున్న క్లబ్‌ల శోభ
సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అప్పటి యజమాన్యం నిర్మించిన సింగరేణి భవనాలు, వెల్ఫేర్ సెంటర్లు ఇంద్రభవనాలను తలపించాయి. క్లబ్‌ల సంక్షేమ శోభ మసకబారిపోయింది. 100 సంవత్సరాలు దాటిన ఈ భవనాల్లో కొన్ని ఇంకా చెక్కుచెదరలేదు. ఇల్లందు క్లబ్, విశ్రాంతి భవనం అందుకు నిదర్శనం. ఇంకా అట్లాగే శోభిళ్ళుతున్నది. బెల్లంపల్లి వంటి పారిశ్రామిక పురాతన ప్రసిద్ధి పట్టణంపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆశనిపాతం అయ్యింది.
బెల్లంపల్లి ఇల్లందు క్లబ్, గెస్ట్ హౌస్ నిరుపయోగంగా నిలిపోయాయి. అక్కడ సింగరేణి అధికారులు (దొరల) కోసం నిర్మించిన క్వార్టర్లు శిథిలమైపోయాయి. ఒకప్పుడు కళకళలాడిన ఈ ప్రాంతం కళావిహీనంగా మారిపోయింది. అత్యంత విలువైన భవనాలు పర్యవేక్షణ కరువై పనికిరాకుండా పోతున్నాయి. నార్త్ ఇండియన్, పొ రుగు రాష్ట్రాల అధికారుల శకం ముగిసే దా కా సింగరేణి అభివృద్ధి దిశలో నడిచింది.