కంగనాకు కొత్త చిక్కులు
గాంధీ ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. కంగనాకు పోలీసుల షాక్!
సిమ్లా: బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) మరో వివాదంలో చిక్కుకున్నారు. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. నవంబర్ 13న సిమ్లాలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదులో.. నవంబర్ 10న కంగనా తన Verified Social Media Account ద్వారా చేసిన పోస్టులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పోస్టు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రమాదం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉందని ఆరోపిస్తూ, Cyber Forensic Investigation నిర్వహించాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 196(1)(b), 353(2), 356(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సిమ్లా ఎస్పీ గౌరవ్ సింగ్ FIR నమోదైన విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై Investigation కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇటీవల 1981 ప్రాంతానికి చెందిన గాంధీ కుటుంబ పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడం ఈ వివాదానికి నేపథ్యంగా నిలిచింది. ఆ వీడియోలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, మేనకా గాంధీతో పాటు చిన్న వయసులో ఉన్న రాహుల్, ప్రియాంక కనిపించారు. ఇదే సమయంలో సోనియా గాంధీ రచించిన Belonging: A Journey of Love పుస్తకం విడుదల కావడం కూడా చర్చనీయాంశమైంది.