శబరిమల గుడి తెరుచుకునేది ఎప్పుడంటే?
అయ్యప్ప భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న శబరిమల యాత్రకు సమయం ఆసన్నమైంది. శబరిమల శ్రీ ధర్మశాస్తా ఆలయ ద్వారాలు ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనున్నాయి. ఆలయ తంత్రి, ప్రధాన పూజారి సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఆలయ తలుపులు తెరిచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం పూజలు, అభిషేకాలు పూర్తయిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి కల్పించనున్నారు. దీంతో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు, యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కొండపైకి వెళ్లే ట్రెక్కింగ్ మార్గంలో (Trekking Route) భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల స్టెయిన్లెస్ స్టీల్ సీటింగ్ (Stainless Steel Seating) సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండ మార్గంలో నడిచి వెళ్లే సమయంలో అలసిపోయిన భక్తులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో వృద్ధులు, దీర్ఘదూరం నడవలేని భక్తులకు కొంత ఉపశమనం కలగనుంది.
ఈసారి యాత్రలో భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా భక్తులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల జీవిత బీమా (Life Insurance) పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రలో ఎదురయ్యే అనుకోని ప్రమాదాల సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రారంభానికి ముందే భద్రత, విశ్రాంతి సదుపాయాలు, బీమా వంటి ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు