డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ పునరాలోచించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)పై రాజకీయ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుపై డీఎంకే (DMK) తన వైఖరిని మరోసారి సమీక్షించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్‌ను కోరారు. బీజేపీ (BJP) ప్రతిపాదిస్తున్న సవరణలతో కూడిన బిల్లు దేశానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వం, మత, భాషా, జాతి వైవిధ్యంతో పాటు మైనారిటీల హక్కులకు విఘాతం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (X Platform) వేదికగా వీడియో విడుదల చేశారు.
గతంలో ఇలాంటి ప్రతిపాదనల వల్ల కలిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డీఎంకే చేసిన కృషిని ప్రకాశ్ రాజ్ గుర్తుచేశారు. రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తి కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు మతతత్వ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందా? అని ప్రశ్నించారు. గతంలో ప్రజలకు వివరించిన ప్రమాదాలను ఇప్పుడు విస్మరించడం వారిని మోసం చేయడమేనని విమర్శించారు.
డీఎంకే తీసుకోబోయే నిర్ణయం ప్రస్తుత రాజకీయాలకే కాకుండా భవిష్యత్ తరాలపై కూడా ప్రభావం చూపుతుందని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడిన పార్టీ ఈ విషయంలో చారిత్రక తప్పిదానికి తావివ్వకూడదని సూచించారు. బిల్లును అంగీకరించే విషయంలో వెనక్కి తగ్గి మరోసారి ఆలోచించాలని స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.
"ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం రేపటి తరాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భావి తరాలు మిమ్మల్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో నిర్ణయించుకునే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది" అంటూ తన వీడియో ద్వారా డీఎంకే నాయకత్వానికి ప్రకాశ్ రాజ్ సందేశమిచ్చారు.