ట్రంప్ భయంకరమైన వార్నింగ్

06-11-2026 | 08:41am

ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తా.. ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు మరింత తీవ్రం కావచ్చా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అవసరమైతే ఇరాన్‌లో మిగిలిన ప్రాంతాలను కూడా ధ్వంసం చేయాల్సి రావచ్చని ఆయన హెచ్చరించారు. అయితే తదుపరి దాడులకు సంబంధించి ఎలాంటి తేదీ, లక్ష్యాలను ప్రకటించలేదు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాన్ని (Nuclear Weapon) కలిగి ఉండటాన్ని అమెరికా అంగీకరించదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ యుద్ధంపై అమెరికా కాంగ్రెస్‌లో వ్యతిరేకత పెరుగుతోంది. డెమోక్రటిక్ పార్టీ నేతలు యుద్ధాన్ని ముగించేందుకు తీర్మానాలు తీసుకురావడంతో పాటు, సైనిక చర్యల లక్ష్యాలు, ఖర్చులు, ముగింపు వ్యూహంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నారు. 

హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ డెమోక్రాట్ గ్రెగరీ మీక్స్(Democrat Gregory Meeks).. ఇరాన్‌తో యుద్ధాన్ని తక్షణమే ముగించేలా కాంగ్రెస్‌లో తీర్మానాలు ప్రవేశపెడతామని వెల్లడించారు. యుద్ధంపై ఉన్నతాధికారుల నుంచి బహిరంగ వివరణ కూడా కోరనున్నట్లు తెలిపారు. డెమోక్రటిక్ విప్ కేథరిన్ క్లార్క్ సైతం ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్పష్టమైన లక్ష్యాలు, Exit Strategy లేకుండానే అమెరికాను యుద్ధంలోకి నెట్టారని ఆరోపించారు. యుద్ధానికి నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు? అమెరికా సైనికులను సురక్షితంగా స్వదేశానికి ఎలా తీసుకొస్తారు? అనే అంశాలపై సమాధానాలు కోరుతామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు, ప్రతిపాదనల విషయంలోనూ అమెరికా అనుమతి తప్పనిసరి అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే ఎలాంటి ఒప్పందం లేదా Negotiation Framework ఖరారైనట్లు ఆయన ప్రకటించలేదు. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిస్థితి భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు అత్యంత కీలకం. ఈ పరిణామాలు ఇంధన ధరలు, సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు