13 July, 2026 | 11:44 AM

పార్లమెంట్ ప్రతిష్టంభనకు తెర

03-12-2024 04:37 AM

సభ సజావుగా జరిగేందుకు అఖిలపక్షం అంగీకారం

రాజ్యాంగంపై చర్చకు తేదీల ఖరారు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పార్లమెంట్ సజావుగా సాగేందుకు అఖిలపక్షం అంగీకారం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశా ల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు అంగీకారం తెలిపారు. విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించే విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ మేరకు అఖిల పక్షం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఈ క్రమంలోనే వచ్చేవారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధి కార, ప్రతిపక్ష ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చించనున్నారు.

ఈ విషయమై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్‌రిజిజు మీడియాకు స్పష్టం చేశారు. కాగా అన్ని అంశా లపై చర్చ జరపాలని విపక్షాలు కోరుతున్నా యి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, పెరుగుతున్న నిత్యవసర ధరలు తదితర అంశా లపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 25న ప్రారంభమైన సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభమవడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ వ్యవహారం, సంభాల్  హింస, మణిపూర్ అంశం లాంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. 

‘సబర్మతి రిపోర్ట్’నువీక్షించిన ప్రధాని

గుజరాత్‌లో గోద్రా అల్లర్ల ఆధారంగా డైరెక్టర్ ధీరజ్ సర్నా తెరకెక్కించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ పార్ల మెంట్‌లో ప్రధాని మోదీ వీక్షించారు. బాల యోగి ఆడిటోరియంలో సోమవారం సా యంత్రం ఎన్డీయే ఎంపీలతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం కృషిని ప్రశంసించారు. 2002, ఫిబ్రవరి 27న పంచమహల్ జిల్లాలోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టగా 59 మంది ప్రాణా లు కోల్పోయారు.