13 July, 2026 | 10:44 AM

మహా ‘పీఠ’ముడి

03-12-2024 04:29 AM
  1. సీఎం ఎంపికపై జరగాల్సిన ఎన్డీయే కీలక భేటీ రద్దు
  2. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యమే కారణం
  3. ఢిల్లీకి వెళ్లిన అజిత్‌పవార్ 
  4. మహారాష్ట్రకు పరిశీలకులను నియమించిన బీజేపీ
  5. 4న బీజేపీ ఎల్పీ సమావేశం!
  6. 5నే కొత్త సీఎం ప్రమాణం

ముంబై, డిసెంబర్ 2: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలై 10 రోజులు గడుస్తున్నా సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడటం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్య మంత్రి అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నా అధికారంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం ఎంపిక కోసం జరగాల్సిన ఎన్డీయే కీలక భేటీ రద్దుంది.

శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని కేంద్ర పరిశీలకులుగా బీజేపీ నియమించింది. బీజేపీకి చెందిన 132 మంది ఎమ్మెల్యేలతో వీరిద్దరు చర్చలు జరపుతారు. అనంతరం ఎల్పీ నేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్ఠానికి తెలియజేస్తారని సమాచారం. 

4న బీజేపీ ఎల్పీ భేటీ!

కొత్త సీఎం పేరును డిసెంబర్ 4న మహాయుతి ప్రకటించనుందని కమలం పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అదేరో జు ఉదయం 10 గంటలకు బీజేపీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎన్డీయే సమావేశం రద్దున వేళ ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పోర్ట్‌ఫోలియోలపై బీజేపీ అగ్రనేతలతో చర్చి ంచే అవకాశముందని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు పూర్తి మెజారిటీ అందించినా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నిస్తున్నాయి. 

పూర్తి ఆధిక్యం కోసం..

మహారాష్ట్రలో 288కు గాను 132 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచినా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమిలోని శివసేన (57), ఎన్సీపీ (41) సీట్లతో 234 సీట్లు ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్లతో పాటు కొన్ని చిన్న పార్టీలు బీజేపీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అంతేకాకుండా శివసేన (ఉద్ధవ్ వర్గం)కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో జతకట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మిత్రపక్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీజేపీ కూడా సొంతంగా పూర్తిస్థాయి మెజార్టీ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఈ టార్గెట్‌ను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. 

మిత్రధర్మాన్ని పాటిస్తూనే.. 

తాజా ఊహాగానాల ప్రకారం కావాల్సిన మెజారిటీ లభించినా బీజేపీ మిత్ర ధర్మాన్ని కచ్చితంగా పాటిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొన్ని నెలల్లో బృహత్ ముంబై కార్పొరేషన్‌తో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. కొంకణ్, మరఠ్వాడా వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో శివసేన, ఎన్సీపీ సైతం బలంగానే ఉన్నాయి.

అందువల్ల పొత్తు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయడం మంచిది కాదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేన, ఎన్సీపీని విస్మరిస్తే ఎంవీఏ బలపడుతుందని, విపక్షాలకు ఈ అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనలోనే బీజేపీ ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆ రెండు శాఖలపై శివసేన పట్టు!

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత షిండేనే సీఎంగా కొనసాగించాలని శివసేన నేతలు పట్టుబ ట్టిన విషయం తెలిసిందే. అయితే బీజే పీ అగ్రనేత అమిత్‌షా భేటీ తర్వాత షిండే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక శాఖలపై శివసేన దృష్టి సారించినట్లు సమాచారం. హోంమంత్రితో పాటు పట్టణాభివృద్ధి శాఖ తమకే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎంతో పాటు హోంశాఖ కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ సైతం భావిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అధీనంలోనే పట్టణాభివృద్ధి ఉండటం ఆనవా యితీగా వస్తోంది. ఈ క్రమంలో శాఖల విషయంలో రెండు పార్టీలు మధ్య ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందో చూడాలి. కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని వస్తున్న వార్తలను ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ ఖండించారు. అవన్నీ నిరాధారమైన వార్తలని, అనారోగ్యం కారణంగానే షిండే విశ్రాంతి తీసుకున్నారని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.