లక్ష్మీ భండార్‌లో 30 లక్షల మంది అనర్హులు
- జూన్ 1 నుంచి ‘అన్నపూర్ణ యోజన’ దరఖాస్తుల స్వీకరణ
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి
కోల్‌కతా, మే 28: పశ్చిమ బెంగాల్‌లో గత టీఎంసీ ప్రభుత్వం అమలు చేసిన ‘లక్ష్మీ భండార్’ పథకంలో 30 లక్షల మంది అనర్హులుగా తేలారని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. అనర్హుల్లో కొందరు భారతీయులే కాదన్నారు. కొందరికి ఓటరు జాబితాలో పేర్లే లేవని, ఉన్నా శాశ్వతంగా తొలగింపునకు గురయ్యాయని వివరించారు. గురువారం విలేఖరుల సమావేశంలో లక్ష్మీభండార్ పథకం స్థానంలో ప్రవేశపెట్టిన ‘అన్నపూర్ణ యోజన’ పథకంపై మాట్లాడారు.
జూన్ 1 నుంచి ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు ఎస్‌ఐఆర్ అనుబంధ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి అగ్నిపాల్ మిత్ర మార్గదర్శకత్వంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి నాయకత్వంలో దరఖాస్తుదారుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫారమ్‌ను ప్రవేశపెడతారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితా ఎంపిక పూర్తి అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లింపులు చేస్తామని అన్నారు.






