09-07-2025 01:00:06 AM
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన
రాష్ట్రానికి చెందిన మహిళలకే కోటా వర్తింపు
యువజన కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
పట్నా, జూలై 8: బీహార్‌కు త్వరలో ఎన్నికల జరగనున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు శుభవార్త ప్రకటించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలుపుకోవాలని చూస్తున్న నితీశ్ సర్కార్ అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ఉదయం క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధాన ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో, అన్ని కేటగిరీలు, జిల్లా స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు 35 శాతం కోటా వర్తించనుంది. అయితే ఈ రిజర్వేషన్ బీహార్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులైన మహిళలకు మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాలన, పరిపాలనలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని నితీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ సేవల్లోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావడం ద్వారా వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీశ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
యువత సాధికారతే లక్ష్యంగా..
ఇక రాష్ట్రంలో యువతకు సాధికారత కల్పించడానికి బీహార్ యువజన కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ ప్రకటించారు. యువతను నైపుణ్యం కలిగిన వారిగా మార్చడమే కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. యువజన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు వైస్ చైర్‌పర్సన్‌లు, ఏడుగురు సభ్యులు ఉంటారు.
45 ఏళ్ల లోపు వారే ఉంటారు. రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న బీహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మహిళలకు సామాజిక పెన్షన్‌ను నితీశ్ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్‌ల పెంపు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రూ.400గా ఉన్న పెన్షన్‌ను ఇప్పుడు రూ.1100లకు పెంచారు. పెరిగిన పెన్షన్ డబ్బులు జూలై నెల నుంచే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికల జరగనున్న వేళ కేంద్రం కూడా ఆ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. బీహార్ రైల్వే అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
బీహార్‌కు 4 కొత్త అమృత్ భారత్ ట్రైన్లు నడపబోతున్నట్టు తెలిపారు. 2వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్ ఎన్నికలు జరిగే అవకాశముంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.