09-07-2025 12:59:24 AM
- రాముని జన్మస్థలం మా దేశంలోనే
- వాల్మీకి రామాయణమే ఇందుకు ఆధారం
-ప్రధాని కేపీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
ఖాట్మండు, జూలై 8: శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి జన్మస్థలం తమ దేశంలోనే ఉందని.. శ్రీరాముడు తమ వాడేనని ఆయన పేర్కొన్నారు. రాముడే కాకుండా శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారన్నారు. సోమవారం ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేపీ ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి జననంపై తాను సొంత మాటలు చెప్పడం లేదని.. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగానే ఈ విషయాలు చెబుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
రాముడు పుట్టిన నిజమైన ప్రదేశం నేపాల్‌లోనే ఉందని.. ఈ నిజాన్ని ప్రచారం చేయడానికి ప్రజలు ఏ మాత్రం వెనుకాడొద్దని ఆయన పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ఓలి ప్రశ్నించారు. హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చినవారేనని తెలిపారు. ఇతిహాసాల్లో పేర్కొన్న పలు ప్రదేశాలు ప్రస్తుతం నేపాల్‌లోని సున్‌సారి జిల్లాలో ఉన్నాయని కేపీ ఓలి అన్నారు.
గతంలోనూ ఓలి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేశారు. 2020 జూలైలో నిజమైన అయోధ్య నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా థోరిలో ఉందని కేపీ శర్మ అన్నారు. చారిత్రక ప్రాంతాలను ఎక్కడెక్కడో ఉన్నట్టు చెప్పేవన్నీ కట్టుకథలేనని అన్నారు. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి నివసించింది కూడా నేపాల్‌లోనేనని పేర్కొన్నారు. రిడీ ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారన్నారు.