బొబ్బిలి యుద్ధంకు నేటికి 60 ఏళ్లు
రెండు ప్రధాన రాజవంశాల మధ్య జరిగిన ఆధిపత్య పోరును దర్శకుడు సి. సీతారాం ‘బొబ్బిలి యుద్ధం’ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సీతారాం నిర్మాతగా కూడా వ్యవహరించారు. నందమూరి తారకరామారావు, భానుమతి, జమున, ఎస్వీ రంగారావు, రాజనాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 1964 డిసెంబర్ 4వ తేదీన అంటే సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలైంది. బొబ్బిలి, విజయనగరం అనేవి ఇరుగుపొరుగు సంస్థానాలు.
విజయనగర ప్రభు వు విజయ రామరాజు (రాజనాల).. బొబ్బిలిరాజు రంగారావు నాయుడు (ఎన్టీఆర్) సాధించిన విజయాలను చూసి అసూయపడుతుంటాడు. ఎలాగైనఆ రంగారావు నాయుడిని అణగదొక్కాలని అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. బొబ్బిలి రాజవంశానికి రాజాం ప్రభువు తాండ్ర పాపారాయుడు (ఎస్వీ రంగారావు) అండగా ఉంటారు. ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీ కప్పం కట్టమనగా కట్టబోమని బొబ్బిలి రాజు రంగారావు నాయుడు తిరస్కరిస్తారు.
దీనిని అవకాశంగా తీసుకుని విజయ రామరాజు బుస్సీ సాయంతో బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది చాలా ఆసక్తికరంగా చిత్రంలో చూపించారు. చిత్రంలో నటించిన వారంతా అఖండులు కావడంతో వారి పాత్రలకు ప్రాణం పోసి సినిమాను విజయవంతం చేశారు. సినిమాలో పాటలు సైతం బాగా ప్లస్ అయ్యాయి.






