18 July, 2026 | 12:52 AM

కాకతీయ వర్సిటీని రాజకీయ వేదికగా మార్చొద్దు

18-07-2026 12:28 AM
  1. అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే నాయిని
  2. విద్యార్థులను రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకోవడం దురదృష్టకరం

హనుమకొండ, జూలై 17(విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీని రాజకీయాలకు అడ్డాగా మార్చకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి పలుమార్లు సమీక్షలు నిర్వహించి, సమగ్ర డీపీఆర్ రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా కూడా యూనివర్సిటీ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి, అభివృద్ధి కోసం నిధులు, ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో కాకతీయ యూనివర్సిటీ ఏ పరిస్థితికి చేరిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన మార్పులు ఏంటో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు నిష్పక్షపాతంగా విశ్లేషించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దొంగ దీక్షలు, తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందినవారే ఇప్పుడు అభివృద్ధి పేరుతో మళ్లీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వివరించేందుకు ప్రయత్నించినా, రెండు మూడు విద్యార్థి సంఘాలు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించాయని విమర్శించారు. యూనివర్సిటీలో సబ్స్టేషన్కు భూమి ఇచ్చినప్పుడు, బ్యాంకుకు స్థలం కేటాయించినప్పుడు, పోలీస్ స్టేషన్కు భూమి ఇచ్చినప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలకు స్థలాలు ఇచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని విద్యార్థి సంఘాలు యూనివర్సిటీకే ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో రిజిస్టర్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, బుర్రి ఉమాశంకర్, చీకటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.