18 July, 2026 | 12:52 AM

ఫీజుల స్కీమ్ ఎత్తేసే కుట్ర మానేయాలి

18-07-2026 12:28 AM
  1. జీవో 9 రద్దు, పాత పద్ధతిలో పథకం అమలు చేయాలి
  2. బకాయిలు 8వేల కోట్లు చెల్లించాలి
  3. విద్యార్థుల భారీ ప్రదర్శనతో కలెక్టరేట్ ముట్టడి
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆర్. కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలను మానుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పథకాన్ని పాత పద్ధతిలోనే యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున విద్యార్థులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్, నీల వెంకటేష్ ముదిరాజ్ నేతృత్వంలో ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ పథకానికి బడ్జెట్ కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్ఠు పట్టించిందని, పేదల పిల్లలు, పేద కులాలు ఉన్నత విద్యనభ్యసించకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 23 వేల ప్రభుత్వ పాఠశాలను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం ఏకపక్ష ధోరణిని విడనాడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ పథకంపై మేధావులు, బీసీ సంఘాలతో చర్చించాలని, ప్రభుత్వానికి భారీ ఆదాయం ఉన్నా విద్యార్థుల చదువుకిచ్చేందుకు 8వేల కోట్ల రూపాయలు లేవా? అని కృష్ణయ్య నిలదీశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ ఐక్య కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజేందర్, కిరణ్ కుమార్, మోహన్ వంశీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.