12 June, 2026 | 1:23 AM

స్వార్థ ప్రయోజనాల పోరు!

12-06-2026 12:00 AM

పశ్చిమాసియాలో మొదలైన యుద్ధాగ్ని ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ ప్రతిస్పందనతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతున్నది. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, రణక్షేత్రంలో మాత్రం బాంబుల మోత ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ముగ్గురు మరణించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమెరికా రాయబార కార్యాలయ అధికారులను పిలిపించి నిరసన తెలిపింది. అంతేకాదు, ఐరాస వేదికగా నౌకాయాన భద్రతపై తన ఆందోళనను స్పష్టం చేసింది. అయితే, ఇరాన్‌తో చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని అమెరికా పలుమార్లు ప్రకటించినా, ఆ చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఒకవైపు చర్చల గురించి ప్రస్తావిస్తూనే, మరోవైపు దాడులు చేయడం వల్ల పరస్పర విశ్వాసం దెబ్బతింటున్నది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నెతన్యాహూను మందలించినట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఒకవైపు దాడులు వద్దని వారిస్తున్న అగ్రరాజ్యం తానే స్వయంగా భీకర దాడులకు దిగడం ప్రపంచానికి విరుద్ధ సంకేతాలను పంపుతున్నది. దీంతో అమెరికా నిజంగా శాంతిని కోరుకుంటున్నదా, లేక తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటున్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ యుద్ధంలో ప్రతి పక్షానికీ సొంత ప్రయోజనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు తన భద్రతే ప్రధానం. ఇరాన్ ప్రాంతీయ ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. ప్రపంచంపై ఆధిపత్యం, ఇంధన మార్గాలపై నియంత్రణ, మిత్రదేశాల రక్షణే అమెరికాకు ముఖ్యం.

అరబ్ దేశాలు తమ రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాయి. ఈ స్వార్థ ప్రయోజనాల మధ్య సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇలా దాడులు చేసుకుంటూపోతే విధ్వంసమే మిగులుతుంది. శాంతి సాధ్యమవ్వాలంటే అన్ని పక్షాలు ముందుగా కాల్పుల విరమణకు అంగీకరించాలి. మధ్యవర్తిత్వానికి ఐరాస మరింత చురుకైన పాత్ర పోషించాలి. యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే. కానీ, దాన్ని ఆపడానికి రాజకీయ సంకల్పం, పరస్పర విశ్వాసం అవసరం. యావత్ ప్రపంచం ఇబ్బందుల ముందు ఏ దేశ ప్రయోజనాలూ ఎక్కువ కావని ప్రపంచ నాయకులు ఇప్పటికైనా గుర్తించి, పశ్చిమాసియా మంటలను ఆర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.