11 June, 2026 | 1:12 AM

క్షీణిస్తున్న విపక్షాల నైతిక సైర్యం

11-06-2026 12:00 AM

వెంకగారి భూమయ్య :

భారతదేశపు ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఒక ఇబ్బందికరమైన మలుపులో నిలిచి ఉంది. దేశ రాజధాని వేదికగా సాగుతున్న ప్రస్తుత పరిణామాలు ఒకవైపు తిరుగులేని అధికార శక్తులకు, మరోవైపు లోలోపల వేధిస్తున్న విశ్వాసరాహి త్యానికి మధ్య జరుగుతున్న ఒక హోరాహో రీ పోరాటాన్ని తలపిస్తున్నాయి.

ఈ రాజకీ య రణరంగంలో ఒకవైపు నాయకత్వ పటిమ, అధికార బలంతో గట్టిగా నిలిచిన అధికార కూటమి కనిపిస్తుండగా; మరోవైపు దానికి పూర్తి భిన్నంగా అంతర్గత సందిగ్ధత, నాయకత్వ శూన్యత, వనరుల కొరతతో కొట్టుమిట్టాడుతూ, ప్రజల ముందుకు ఒక బలమైన ప్రత్యామ్నాయ ఆలోచనను తీసుకువెళ్లడానికి నిరంతరం ఇబ్బంది పడుతున్న ప్రతిపక్ష కూటమి కనిపిస్తోంది. ఈ నేపథ్యం లో రాబోయే రోజుల్లో దేశ రాజకీయ గమనాన్ని పూర్తిగా మార్చివేసే కీలక పరిణా మాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అత్యంత ఉత్కంఠభరితమైన మార్పుల మధ్య, తీవ్రమైన నిరాశ, నిస్పృహల వాతావరణంలో ఇటీవల విపక్ష ఇండీ కూటమి భేటీ జరిగింది. ఒకప్పుడు అధికార పక్ష జాతీ య ఆధిపత్యానికి ఏకైక బలమైన ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా పేరుపొందిన ఈ కూటమి ప్రస్తుత తరుణంలో ప్రాంతీయ నేతల కలయికగా మాత్రమే కనిపిస్తోంది. ఈ అత్యున్నత స్థాయి భేటీకి హాజరైన వివిధ పక్షాల నాయకుల జాబితాయే ఈ కూటమి లో నెలకొన్న అంతర్గత విభేదాలను స్పష్టం గా బయటపెడుతోంది.

ప్రధాన పక్షం కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు సమావేశానికి హాజరుకాగా, వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతీ య పక్షాల అధినేతలు, ముఖ్య నాయకులు వచ్చారు. ఈ కూటమికి సిద్ధాంతపరమైన బలాన్ని, దక్షిణ భారతదేశపు నైతిక మద్దతును అందించే ప్రధాన ప్రాంతీయ శక్తులు ఈ భేటీకి పూర్తిగా దూరం కావడం అత్యంత ప్రాధాన్యం కలిగించే అంశం. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష కూటమిలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న డీఎంకే ఈ భేటీకి దూరం కావడం గమనార్హం.

అందుకే ఈ సమావేశపు చర్చల ఆలోచన కేవలం స్వీయ రక్షణాత్మక వ్యూహాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల పెద్దన్న కాంగ్రెస్ పదే పదే ఐక్యతా రాగాన్ని ఆలపించాల్సి వచ్చింది. అయితే, ఈ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడిగా తీవ్రస్థాయిలో విమర్శల దాడికి దిగడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

దేశంలో నిరంతరం నిరు ద్యోగ యువతను వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యో గ నియామక పరీక్షల ‘ప్రశ్నాపత్రాల లీకేజీలు’, తద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవడం, క్షేత్రస్థాయిలో కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, వేసవిలో దేశవ్యాప్తంగా తలెత్తుతున్న తీవ్ర విద్యు త్ కోతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గుల వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలపై పడుతున్న ఒత్తిడి వంటి అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత ఈ పోరాటాన్ని అధికార పక్షపు ఆధిపత్యానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న సైద్ధాంతిక పోరాటంగా అభివర్ణిస్తున్నారు. అయితే, విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఒక తాటిపైకి తెచ్చి నడిపించే స్థాయికి ఆ నేత ఇంకా ఎదగకపోవడం కూటమికి ప్రతికూలంగా మారింది.

అందుకే ఇప్పటికీ విపక్ష కూటమిలో అందరికీ ఆమోదయోగ్యమైన ఏకైక నాయకుడు లేడు. కేవలం అధికార పక్ష వ్యతిరేకత తప్ప, ఒక కనీస ఉమ్మడి ప్రణాళిక కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. అధికార కూటమి అపారమైన ఆర్థిక వనరు లు, వ్యూహాలను తట్టుకుని నిలబడే సామ ర్థ్యం కూటమికి లోపించింది. అందువల్ల విపక్ష కూటమి సమస్యలతో సతమతమవుతున్న బాధితుల కలయికగా మాత్రమే మిగిలిపోతున్నది.

ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా కేంద్రంలో ని అధికార కూటమి కనిపిస్తున్నది. అందుకే అధికార కూటమి భేటీ అనేది ప్రభుత్వ విధానాలపై చర్చలు, ప్రతిపక్ష కూటమిని ఎదు ర్కొనే వ్యూహాల రచనల కంటే కూడా, తమ నాయకత్వ ఆరాధన సభగా సాగుతున్నది. రాజకీయంగా సాధించిన విజయాలను సంపూర్ణ సర్వాధిపత్యంగా ఎలా మార్చుకోవాలనే వ్యూహాలు ఆ భేటీలో స్పష్టంగా కని పిస్తాయి.

‘అజేయ నాయకుడి’గా దేశ ప్రధా ని కీర్తిప్రతిష్టలు, ప్రజాదరణను మరింతగా పెంపొందించేలా ఆయా రాష్ట్రాల ముఖ్యనేతల ప్రసంగాలు సాగుతాయి. రాబోయే రోజుల్లో పలు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతోపాటు వారి ఆలోచనలను పూర్తిగా శాసించడమే లక్ష్యంగా అధికార కూటమి ముందుకుసాగుతున్నది.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఒకవైపు దేశ ప్రధాని స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక జాతీయవాదం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన పంపిణీని ఒక శక్తివంతమైన రాజకీయ అస్త్రంగా మార్చి, ప్రజలతో నేరుగా మమేకమయ్యే తిరుగులేని ప్రసంగకర్తగా నిలిచారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత తనను తాను సమాజంలో వెనుకబడిన, పీడిత వర్గాల గొంతుకగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ వారసత్వ రాజకీయాల ముద్ర, నాయకత్వ సమర్థతపై వస్తున్న నిరంతర ప్రశ్నలు ఆయనను వెనక్కి లాగుతున్నాయి. విపక్షాల కూటమి ప్రధానిని ఒక నియంతృత్వ సర్కార్‌ను నడిపించే నాయకుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటే, అధికార కూటమి మాత్రం ప్రతి పక్షాలను స్వార్థపూరిత, కుటుంబ రాజకీయ పక్షాలు, అవకాశవాద ప్రాంతీయ నేతల కలయికగా అభివర్ణిస్తోంది. ఈ రెండు ప్రధాన శక్తులు రాబోయే కాలంలో జరగబోయే అంతిమ రాజకీయ యుద్ధానికి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నాయి.

అయితే ఈ రాజకీయాల వెనుక ఉన్న అసలైన, లోతైన విశ్లేషణ పూర్తిగా ఆయా పక్షాల అంతర్గత నిర్మాణాలపై ఆధారపడి ఉంది. అధికార పక్షం తన పరిపాలనా కాలాన్ని ఒక స్వయం-శక్తివంతమైన చక్రంగా మార్చుకోవడంలో పూర్తిగా విజయం సాధించింది. సంక్షేమ పథకాల ద్వారా నిరంతరం కొత్త లబ్ధిదారులను సృష్టించడం, ఎన్నికల్లో ఆ లబ్ధిదారుల ఓట్లను కొల్లగొట్ట డం, తద్వారా ఘన విజయాలు సాధించడమే అధికార కూటమి వ్యూహం.

అధికార పీఠాలను చేజిక్కించుకోవడం ద్వారా రాబో యే ఎన్నికల కోసం మరింతగా వనరులను సమీకరించడమనే వ్యూహం అధికార పార్టీకి మొదటినుంచి సత్ఫలితాలను ఇస్తున్నది. దీనికి పూర్తిగా భిన్నంగా ప్రతిపక్షం మాత్రం వరుస ఓటములు, నాయకుల వలసలు, ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. అధికారం కోల్పోయిన రాష్ట్రాలలో ఆయా పక్షాలకు నిధులు పూర్తిగా నిలిచిపోతున్నాయి. అగ్రనేతలు ఇతర పక్షాల వైపు చూస్తున్నారు. దానివల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తల నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

దేశ రాజకీయ దిశను ఈ రెండు ప్రధాన కూటములు రాబోయే రోజుల్లో నిర్వహించే సమావేశాలు నిర్ణయించనున్నాయి. అధికా ర కూటమి తన సంస్థాగత బలాన్ని, ప్రచార యంత్రాంగాన్ని వాడుకొని రాబోయే ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలని చూస్తుంటే, విపక్షాల కూటమి మాత్రం ఎలాగైనా ప్రాంతీయ శక్తులను ఏకం చేసి, కనీసం రాబోయే ఎన్నికలలోనైనా విజయం సాధిం చి, తద్వారా సార్వత్రిక ఎన్నికల నాటికి తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని ఆరాటపడుతోంది.

ప్రస్తుతం విపక్ష కూటమి భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ, అది అంత సులువు కాదు. ప్రతిపక్షం మొదటగా నాయకత్వ శూన్యతను పూరించుకోవాలి. ప్రజా సమస్యలపై ఒక స్పష్ట మైన ఆర్థిక, సామాజిక వ్యూహాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదే సమయంలో అధికార కూటమి కూడా మితిమీరిన అహంకారం, అతివిశ్వాసాలను వీడాలి. లేకపోతే అధికార పీఠాల పునాదులు కదిలే ప్రమాదం లేకపోలేదు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక్కసారిగా కూలిపోవు. కానీ, అసమ్మతిని అణచివేయడం, ప్రజా గొంతుకలను నొక్కివే యడం, ప్రజల ముందున్న ప్రత్యామ్నాయాలను తొక్కిపెట్టడం వల్ల ఎన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని చరిత్ర మనకు చెబుతున్నది. అయితే, తమకు ఎలాంటి పాలకులు కావాలో ఎన్నుకునేది మాత్రం అంతిమంగా దేశ ప్రజలే.

 వ్యాసకర్త సెల్: 9848559863