8 June, 2026 | 12:07 PM

కాలం మార్చలేని బంధం

08-06-2026 11:18 AM

22 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

పాములేరులో ఆత్మీయంగా న్యూస్కాలర్ కాన్వెంట్ స్కూల్ 2004 బ్యాచ్ సమ్మేళనం

బూర్గంపాడు,(విజయక్రాంతి): జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చినా, బాల్య స్నేహం మాత్రం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందనే విషయాన్ని న్యూస్కాలర్ కాన్వెంట్ స్కూల్, మొరంపల్లిబంజర్‌కు చెందిన 2004 ఏడో తరగతి బ్యాచ్ విద్యార్థులు మరోసారి చాటిచెప్పారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత పాములేరులో నిర్వహించిన గెట్ టు గెదర్‌లో పాల్గొని చిన్ననాటి అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పాఠశాల ఆవరణలో కలిసి ఆడిపాడిన స్నేహితులు, నేడు ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో బిజీ జీవితాలు గడుపుతున్నప్పటికీ, పాత జ్ఞాపకాల పిలుపుతో ఒకేచోట చేరి భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.

పాఠశాల రోజుల సరదా సంఘటనలు, గురువుల జ్ఞాపకాలు, సహచరులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని, భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాలం గడిచినా స్నేహానికి వయస్సు ఉండదని ఈ కలయిక మరోసారి నిరూపించింది. స్నేహం, ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన ఈ సమావేశం అందరికీ మధుర జ్ఞాపకంగా మిగిలింది.ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, ధనలక్ష్మి, సంధ్యారాణి, చంద్రశేఖర్ రెడ్డి, మౌనిక, శైలజ, అనంత్, శ్రవణ్, చంటి, రఘురామిరెడ్డి, కృష్ణారెడ్డి, హేమంత్, రాజశేఖర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ముకుందారెడ్డి, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.