25 June, 2026 | 1:30 AM

కారు సునామీ ఖాయం

25-06-2026 12:00 AM
  1. కరీంనగర్‌లో అన్ని స్థానాల్లో గెలుస్తాం
  2. ప్రజలు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఎన్నికలు ఎప్పుడొచ్చినా కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ సృష్టిస్తుందని, బీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో గెలుస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన కదం తొక్కాలని నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో జరిగిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి కంచు కోట అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు, మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా భారత రాష్ట్ర సమితి వైపు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని అన్నారు. సమావేశంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గాల వారిగా పార్టీ తాలూకు క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎస్‌ఐఆర్ పైన జరుగుతున్న కార్యక్రమాలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణి పైన అటు బిజెపి, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, సింగరేణి కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. కరీంనగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్నారని, ఈ తీరును ఎండగట్టాలన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు.