పారదర్శకంగా ‘ట్యాపింగ్’ కేసు
పోలీసుల దర్యాప్తులో మా జోక్యం ఉండదు
ఈ కేసుపై బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉండవు
కోడ్ ముగిశాక విద్యుత్ అంశాలను బయటపెడుతా
అవతరణ వేడుకలకు సోనియా వస్తారు
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ప్రతి అంశంలో సీబీఐ విచార ణకు డిమాండ్ చేసే బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎందుకు సీబీఐ విచారణ కోర టం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయబోదని స్పష్టం చేశారు. తీవ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏమైనా సమచారం ఉంటే ఎస్ బీఐ అధికారులు, కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడుతారు తప్ప తనతో కాదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం.. మంగళవారం అక్కడ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రప్రజల తరఫున తెలంగాణ అవతరణ వేడుకలకు రావాలని సోనియాగాంధీని ఆహ్వానించామని, అందుకు ఆమె ఒప్పుకొన్నట్టు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పారద్శకంగా సాగుతున్నదని తెలిపారు. ‘మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో ఎస్‌ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మాయమయ్యాయని గుర్తించాం. అందు కు ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం బయటికి వచ్చింది.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సమీక్ష జరగలేదు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు’ అని పేర్కొన్నారు. 1980, 90 దశకాల నుంచి సేకరించిన డాటా అంతా ఉందా లేదా? బ్యాకప్ ఉందా? మాయం చేశారా..? అనేది దర్యాప్తు సంస్థల అధికారులకు తెలుస్తుందని అన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు పారదర్శంగా జరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏ వ్యవస్థను తమ ప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని చెప్పారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది అధికారులను మార్చారని, తెలంగాణలో ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదని గుర్తుచేశారు. ఒకవేళ అధికారులు తమకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా అంశాలపై చర్చించాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. దీంతో కరెంట్ పునరుద్దరణకు కొంత సమయం తీసుకొని ఉండొచ్చని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా సమస్యలు రాకుండా చూస్తున్నామని వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్‌కు సంబంధించిన అంశాలను బయటపెడుతామని సీఎం పేర్కొన్నారు.
నిపుణుల సూచనలతో కాళేశ్వరంపై ముందుకు
కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తామని సీఎం తెలిపారు. కాళేశ్వరం సమస్య 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చేది కాదని, విరిగింది వెన్నెముక అని అన్నారు. ప్రస్తుతం నీటిని నిల్వచేసి విడుదల చేసే పరిస్థితి లేదని తెలిపారు. కాళేశ్వరం కరెంట్ బిల్లులు అన్నీ సముద్రంలో వదిలిన నీళ్లలాంటివని అన్నారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికి కూడా కరెంట్ బిల్లులు కట్టామని తెలిపారు.
రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అందెశ్రీకే..
రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావు లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర గేయంగా ‘జయ జయహే తెలంగాణ’ను రూపకల్పన చేసే పూర్తి బాధ్యతను ఆ గేయ రచయిత అందెశ్రీకే అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్ర గేయా నికి సంగీత రూపకల్పన ఏ దర్శకుడితో చేయించాలనేది తన పని కాదని పేర్కొన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేద ని, ఎవరితో రూపకల్పన చేయించాలనే అంశం అందెశ్రీ ఇష్టమని స్పష్టంచేశారు.
తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని సీఎం అన్నారు. త్యాగాలు, పోరాటా లకు తెలంగాణ నిదర్శమని, అందుకే రాచరిక ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క, నాగోబా జాతరలు తెలంగాణ స్ఫూర్తి ప్రతీకలని, అధికారికి చిహ్నంలో ఈ రెండు ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర చిహ్నం రూపకల్పన బాధ్యతలను ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన నిజామాబాద్ బిడ్డకు అప్పగించినట్లు చెప్పారు.






