కేటీఆర్ వల్లే ఒక కులానికి మచ్చ

16-09-2026 | 05:25am
  1. ఒక కులం అంతా తలదించుకుంటోంది 
  2. దొరహంకారంపై దళితులు తిరగబడతారు  
  3. ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ హెచ్చరిక 

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : దళితుల విషయంలో దొర అహంకారంతో వ్యవహరిస్తున్న కేటీఆర్‌పై దళితులు త్వరలోనే తిరగబడుతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ (Government Whip Balmuru Venkat) పేర్కొన్నారు. కేటీఆర్ ప్రవర్తన సిగ్గు అనిపిస్తోందని విమర్శించారు. ఒక కులానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆయన చేసిన తప్పులకు తమ కులం అంతా తలదించుకుంటోందని ఆవేదన చెందారు.

తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ సమావేశం తర్వాత అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించారో అందరూ చూశారని అన్నారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా స్పీకర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారన్నారు. గణేష్ మండపం డీజే అనుమతి కోసమే కొందరు యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, అందులో కేటీఆర్ పీఏ, పీఆర్వోల గురించి ఎవరికీ తెలియదన్నారు. తాము పదేళ్లు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏనాడూ కూడా ఇలాంటి భాష, ఇలాంటి ప్రవర్తన చేయలేదన్నారు. నా పక్కటెముకలు విరిగిపోయినా పోలీసులను దూషించలే దన్నారు.

కేటీఆర్ కంటే ఎక్కువ తిట్లు తిట్టగలమని, కానీ తల్లిదండ్రులు మాకు విజ్ఞత నేర్పించారని బల్మూరు వెంకట్ తెలిపారు. కేటీఆర్ పీఏ, పీఆర్వోలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని, లేకుంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  


మరిన్ని వార్తలు