కరీంనగర్ బస్టాండ్‌లో జన్మించిన చిన్నారికి జీవిత కాలం ఉచిత ప్రయాణం
హైదరాబాద్/కరీంనగర్, జూన్ 19 (విజయక్రాంతి): కరీంనగర్ బస్ స్టేషన్‌లో ఈ నెల 16న పుట్టిన చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని ఎండీ వీసీ సజ్జనార్, ఉన్నతాధికారులు హైదరాబాద్ బస్ భవన్‌లో బుధవారం అభినందించి, సన్మానించారు.
మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహారించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు.. ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.






