కేసీఆర్ ముద్ర చెరిపేసే కుట్రలు
గురుకులాలు రద్దు చేస్తే ఉద్యమిస్తాం
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని, ఆయన మార్క్ లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. టీఎస్ స్థానంలో టీజీ తెచ్చారని, రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఉద్యమకారుడు కాదని, ఆయనకు తెలంగాణ చరిత్ర కూడా గురించి తెలియదని, ప్రజలకు కావాల్సిన అత్యవసర విషయాలు పక్కన పెట్టి ఇతర అంశాలపై దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ గురుకుల విద్యను పటిష్ఠం చేస్తే వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకుని, ఉన్నతస్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప గురుకులాలను నిర్వీర్యం చేయవద్దన్నారు. రేవంత్ పాలనలో గురుకులాల మీద నీలి నీడలు కమ్ముకున్నాయని ఆరోపించారు.
గ్రూప్ 1 నిర్వహణపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవగాహన లేదని, హరీశ్‌రావుకు పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. హరీశ్‌రావు వేసిన 4 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. ఆయన పనితనం చూసి కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని, హరీశ్‌రావు ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, కాంగ్రెస్ నేతలు ఎందుకు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.






