4 April, 2026 | 4:54 PM

పెంపుడు కుక్క దాడిలో చిన్నారి మృతి

15-05-2024 01:13 AM

వికారాబాద్, మే 14 ( విజయక్రాంతి): ఐదు నెలల చిన్నారిని ఓ పెంపుడు కుక్క దాడిచేసి ప్రాణాలు తీయడం మంగళవారం తాండూరులో కలకలం రేపింది. ఈ విషాద సంఘటన తాండూరు మడలం కరన్‌కోట్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బసవేశ్వర్‌నగర్‌లో ఓ పాలిష్ యూనిట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పుట్టిన ఏకైక సంతానం సాయి (ఐదు నెలలు).

రోజువారీగా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయిని కట్ చేస్తుండగా దాహం వేసింది. దాహం తీర్చుకునేందుకు నీళ్లు తీసుకురావాలని తన భార్య లావణ్యకు చెప్పాడు. దీంతో లావణ్య పసికందును ఇంట్లో ఉంచి నీళ్లను తన భర్తకు ఇవ్వడానికి వెళ్లింది. ఇంతలోనే అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి పసికందును అతి క్రూరంగా కొరికి పీక్కుతింది.

బాబు ఏడ్పులు విన్న తల్లి లావణ్య హూటాహూటిన ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే కుక్క దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. సాయి అప్పటికే మృతిచెందాడు. దీంతో పసికందు మృతిని తట్టుకోలేక పోయిన కుటుంబ సభ్యులు పెంపుడు కుక్కను కొట్టి చంపారు. పసికందుపై దాడిచేసిన కుక్క పాలిష్ షాపు యజమానిదా లేక చుట్టుపక్కల వారిదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.