4 April, 2026 | 3:12 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

రాష్ట్రంలో మరో ఎన్నిక 27న

15-05-2024 01:15 AM

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక 

బరిలో 52 మంది

జూన్ 5న కౌంటింగ్

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి):  రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక త్వరలోనే  వరంగల్ ఖమ్మెం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మొత్తం  52 మంది బరిలో ఉన్నారు. మే 27న ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం పట్టభద్రుల  ఓటర్లు 4.63 లక్షల మంది ఉండగా,   605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా  ప్రాతినిథ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్,  బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా  బక్కా జడ్సన్, అశోక్‌తోపాటు మరికొందరు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కూడా స్వతంత్ర అభ్యర్థిగా  పోటీ చేశారు. అప్పుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా, మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై యువత  సానుకూలంగా లేదని, తమకు కలిసి వస్తుందని బీజేపీ, బీఆర్‌ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు భావిస్తున్నారు.