25 June, 2026 | 7:25 AM

స్టాక్ మార్కెట్లో రికార్డుల హోరు

08-06-2024 12:05 AM
  • సెన్సెక్స్ 1,700 పాయింట్లు, నిఫ్టీ 490 పాయింట్ల ర్యాలీ

చరిత్రాత్మక గరిష్ఠం వద్ద ముగిసిన సూచీలు

న్యూఢిల్లీ, జూన్ 7: కేంద్రంలో తిరిగి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న వార్తలతో గత రెండు రోజులు జరిగిన ర్యాలీ శుక్రవారం రికార్డులతో హోరెత్తించింది. తాజాగా రిజర్వ్‌బ్యాంక్ జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని 7.2 శాతానికి పెంచినట్టు ప్రకటన వెలువడగానే బుల్స్ కదం తొక్కారు. అన్ని రంగాల షేర్లనూ రెండు చేతులా అందుకున్నారు. ఫలితంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్ 76,000 పాయింట్ల స్థాయిని దాటిపోయింది. ఇంట్రాడేలో 1,720 పాయింట్లు ఎగిసి  76,795 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 1,618 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక గరిష్ఠస్థాయి 76,693 పాయింట్ల వద్ద ముగిసింది. 

వరుస మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 4,600 పాయింట్లుపైగా ర్యాలీ జరిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న సెన్సెక్స్ 4,300 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 498 పాయింట్లు ర్యాలీ జరిపి 23,320 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఈ సూచి కొత్త రికార్డుస్థాయికి మరో 18 పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ముగింపు మాత్రం కొత్త రికార్డే. 469 పాయింట్ల లాభంతో 23,290 పాయింట్ల వద్ద నిలిచింది. జూన్ 3న నిఫ్టీ 23,338 పాయింట్ల రికార్డుస్థాయికి పెరిగింది. 

మూడు రోజుల్లో రూ.28.65 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడిరోజున ఇన్వెస్టర్లు పోగొట్టుకున్న సంపద వేగంగా రికవరీ అయ్యింది. వరుసగా మూడు రోజులపాటు జరిగిన ర్యాలీ ద్వారా మదుపరుల సంపద రూ.28.65 లక్షల కోట్లు పెరిగింది. జూన్ 4న ఒకే రోజులో రూ.31 లక్షల కోట్ల సంపద నష్టపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఆ రోజున స్టాక్ సూచీలు చవిచూసిన నష్టాన్ని అంతటినీ ఈ మూడు రోజుల్లో పూడ్చుకుని కొత్త రికార్డుస్థాయికి చేరినప్పటికీ, ఇన్వెస్టర్ల సంపద ఇంకా ఆ స్థాయిని అందుకోలేదు. వరుస మూడు రోజుల్లో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.28,65,742.36 కోట్లు పెరిగి రూ.4,23,49,447.63  కోట్ల వద్దకు చేరింది.