వడ్డీ రేట్లు యథాతథం! త్వరలో తగ్గించే ఛాన్స్
న్యూఢిల్లీ, జూన్ 7: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌బ్యాంక్ ఎనిమిదోసారీ తన కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఆర్థిక వృద్ధి జోరు కనపరుస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం అదుపుపై దృష్టి ఉంచాలని, అందుకోసం కఠిన ద్రవ్య విధాన వైఖరినే అనుసరించాలని తమ పాలసీ సమీక్షలో నిర్ణయించినట్టు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్ల దిశను నిర్దేశించే ఆర్బీఐ తన కీలక రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టిపెట్టడం వరుసగా ఇది 8వ పాలసీ సమీక్షా సమావేశం.
వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. రెపో రేటు తగ్గితే బ్యాంక్‌ల రుణ వితరణ రేట్లను తగ్గిస్తాయి. రెపో రేటు పెరిగితే బ్యాంక్ రుణాల రేటు పెరుగుతుంది. దీంతో రిటైల్ కస్టమర్లకు ఈఎంఐలు పెరగడం, కార్పొరేట్లకు రుణ భారం అధికంకావడం జరుగుతుంది.
కమిటీలో పెరిగిన అసమ్మతి
రిజర్వ్‌బ్యాంక్ తాజా సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్ల యథాతథ స్థితిపై అసమ్మతి పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)దే. ఇందులో ముగ్గురు ఆర్బీఐకి చెందినవారు, మరో ముగ్గురు బయటి (కేంద్ర ప్రభుత్వ నియమితులు) సభ్యులు ఉంటారు. ఈ మొత్తం ఆరుగురిలో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్నే ఆర్బీఐ అమలు చేస్తుంది. తాజాగా సరళ విధాన వైఖరిని అనుసరించాలని, వడ్డీ రేటును పావుశాతం తగ్గించాలంటూ ఇరువురు బయట సభ్యులు ఓటు చేశారు.
రెండు నెలల క్రితం జరిగిన సమీక్షలో జయంత్ వర్మ ఒక్కరే రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేయగా, ఈ దఫా మరో సభ్యురాలు అషిమా గోయల్ జతకలిసారు. కమిటీలోని ఇతర సభ్యులు శశాంక్ భిడే, రాజీవ్ రంజన్, మైఖల్ దేబబ్రత పాత్రా, శక్తికాంత్ దాస్‌లు యథాతథ స్థితికి ఓటు చేశారు. భిడే కూడా బయటి సభ్యుడుకాగా, రంజన్, పాత్ర, దాస్‌లు ఆర్బీఐ అధికారులు. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడో దఫా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఎంపీసీలో రేట్ల కోత గొంతు పెరగడం గమనార్హం.
ఎంపీసీ నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటిస్తూ వృద్ధి దెబ్బతినకుండా, ద్రవ్యోల్బణం తగ్గడాన్ని ఎంపీసీ పరిగణనలోకి తీసుకున్నదని తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే రిస్క్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిటీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు దాస్ వివరించారు. ఇదే సమయంలో వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉంచేరీతిలో రెపో, రివర్స్ రెపో కార్యకలాపాల్ని నిర్వహిస్తామని చెప్పారు.
వృద్ధి అంచనాలు పెంపు
ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని ఆర్బీఐ 7.2 శాతానికి పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కోలుకోవడం, ప్రైవేటు వినియోగం పెరగడంతో వృద్ధి రేటు అంచనాల్ని పెంచినట్టు శక్తికాంత్ దాస్ మీడియాకు తెలిపారు. గత సమీక్షలో ఆర్బీఐ 7 శాతం వృద్ధిని అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 8.2 శాతం వృద్ధిచెందినట్టు ఇటీవల జాతీయ గణాంకాల శాఖ ప్రాధమిక అంచనాల్లో వెల్లడించింది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా ఉన్నాయని, తయారీ రంగం, సర్వీసుల రంగం వృద్ధి కొనసాగుతున్నదని దాస్ వెల్లడించారు. వ్యవసాయ రంగ కార్యకలాపాలు పుంజుకోవడంతో గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతున్నదని, పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్టు బ్యాంక్ రుణ వితరణ సూచిస్తున్నదని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. రుతువపనాలు సగటుకంటే అధికంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాల్నిబట్టి రిజర్వాయిర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని, ఖరీఫ్ దిగుబడి మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 2024 7.2 శాతం వృద్ధి రేటును, క్యూ1లో 7.3 శాతం, క్యూ2లో 7.2 శాతం, క్యూ3లో 7.3 శాతం, క్యూ4లో 7.2 శాతం చొప్పున ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన బ్యాంక్‌లు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు, మూలధన పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి, అధిక వినియోగ సామర్థ్యం, వ్యాపారాల ఆశాభావ పరిస్థితులతో పెట్టుబడుల కార్యకలాపాలు పుంజుకుంటాయన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం పరిణామాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు.
ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగితేనే తదుపరి విధాన చర్యలు
ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగివస్తేనే రిజర్వ్‌బ్యాంక్ తదుపరి ద్రవ్య విధాన చర్యల్ని చేపడుతుందని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. కేంద్ర బ్యాంక్ ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తగ్గించడమేనని, 4 శాతం లేదా అంతకంటే తక్కువకు చేరుతుందన్న గట్టి విశ్వాసం కలిగేంతవరకూ వడ్డీ రేట్ల మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టారు.
గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.8 శాతానికి తగ్గినప్పటికీ, మళ్లీ అది 5 శాతానికి పెరిగిందని చెప్పారు. ‘ద్రవ్యోల్బణం మా 4 శాతం లక్ష్యానికి చేరి, అక్కడే స్థిరపడుతుందన్న విశ్వాసం కలగాలి. అప్పుడు మేము తదుపరి ద్రవ్య విధాన చర్యల్ని చేపట్టే అంశాన్ని ఆలోచిస్తాం’ అని దాస్ చెప్పారు. కేంద్రంలో ఏర్పడే కొత్త సంకీర్ణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలపై వ్యాఖ్యానించేందుకు ఆర్బీఐ గవర్నర్ నిరాకరించారు.
ఫెడ్ కంటే ముందే రేట్ కట్‌కు సిద్ధమంటూ సంకేతాలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌కంటే ముం దుగానే రేట్ల కోతకు ఆర్బీఐ సిద్ధమేనన్న సంకేతాల్ని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. తమ ద్రవ్య విధాన చర్యలు దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం ఆధారంగా ఉంటాయని సూచనా ప్రాయంగా చెప్పారు. ‘మేఘాలు కమ్ముకుంటున్నాయా, విడిపోతు న్నాయా అనేది గమనిస్తూ ఉంటాం. స్థానిక వాతావరణం, పిచ్ స్థితికి అనుగుణంగా మేము గేమ్ ఆడతాం’ అని దాస్ తెలిపారు.
పశ్చిమ దేశాల ద్రవ్య విధాన ప్రభావం భారత మార్కెట్లపై ఉంటుందని, అయితే తమ చర్యల్ని దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులే నిర్ణయిస్తాయని చెప్పారు. రేట్లను తగ్గించే సమయం, పరిమాణంపై మార్కెట్ అంచనాలపై దాస్ వ్యాఖ్యానిస్తూ భవిష్యత్తులో వెలువడే గణాంకాలు, కేంద్ర బ్యాంక్ ఇచ్చే సంకేతాలనుబట్టి మార్కెట్ అంచనాలు కూడా మారిపోతాయన్నారు.






