25 June, 2026 | 8:13 AM

ఫారెక్స్ కొత్త రికార్డు

08-06-2024 12:05 AM

651.5 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు

ముంబై, జూన్ 7: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే 31తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 4.837 బిలియన్ డాలర్ల మేర పెరిగి చరిత్రాత్మక గరిష్ఠస్థాయి 651.51 బిలియన్ డాలర్ల వద్దకు ఎగిసాయి. ఇవి మే 24తో ముగిసినవారంలో 2.027 బిలియన్ డాలర్ల మేర తగ్గి 646.673 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. తాజాగా మే 31తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 5.065 బిలియన్ డాలర్లు పెరిగి 572.564 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వల్లో  తగ్గుదల

దేశం వద్దనున్న బంగారం నిల్వలు సమీక్షావారంలో 212 మిలియన్ డాలర్ల మేర తగ్గి 56.501 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 17 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 18.118 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 1 మిలియన్ డాలర్లు  పెరిగి 4.326 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.