2 May, 2026 | 2:31 PM

శ్రుతి మించిన ఉచితాల సంస్కృతి

09-02-2025 12:00 AM

దోర్బల బాలశేఖరశర్మ :

‘కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి కనుక ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకోవాలని’ పెద్దలు అనేవారు. మనకు ఎంత సంపద ఉన్నా గంపగుత్తగా దానధర్మాలు చేస్తూ పోతే ఎప్పటికో ఒకప్పటికి అవన్నీ కరిగిపోయి అప్పుల పాలు కావడం ఖ యం. మన దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రజలకు అనేక రకాల ఉచితాలను అలవాటు చేస్తున్నాయి.

ఇప్పటికి అది బాగా శృతి మించింది. పర్యవసానాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. చివరకు ఆయా ప్రభుత్వాల ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి కనీస ఆర్థిక వనరులనైనా రుణాలు చేయకుండా సర్దుబాటు చేసుకోలేని దుస్థితికి పలు రాష్ట్రాలు చేరుకోవడం దురదృష్టకరం.

తాజాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజధాని నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెట్రో ఛార్జీలపై 50 శాతం తగ్గింపు ఇస్తామంటూ మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చింది. 

తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామంటూ ఎన్నికలకు ముం దు ఇచ్చిన హామీని గత 13 నెలలుగా విజయవంతంగా అమలు చేస్తున్నది. మన దేశ రాజకీయాలలో ఉచితాల సంస్కృతి పెరిగి పెరిగి, ఇవాళ్టికి చికిత్స చేసుకోలేని క్యాన్సర్ వ్రణం వలె మారిందంటే అతిశయోక్తికాదు.

ఈ సంప్రదాయం ఎక్కడిదాకా వచ్చిందంటే, ఎన్నిక ల్లో అలాంటి హామీలకు మాత్రమే ఓట్లు పడతాయనే అభిప్రాయం స్థిరపడింది. చాలా పాతరోజుల్లో విద్యుత్, రేషన్, వంటగ్యాస్ వంటి ఏవో కొన్నింటినే రేషన్ ధరకో లేదా ఉచితానికో ఆర్థికంగా వెనుకబడిన వారికి అందించిన ప్రభుత్వాలు గత కొన్నాళ్లుగా విద్య, వైద్యం నుంచి బస్సు, రైలు ఛార్జీల వరకూ ఉచితాల వరాలు ఇచ్చే స్థితికి వచ్చేశాయి. 

పునఃపంపిణీ పరిష్కారం కాదు!

ప్రపంచంలోని మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉన్నా, మన దేశంలో మాత్రం కోట్లాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్ప నలు, వనరులు కల్పించకుండా, సంక్షేమం పేరుతో అత్యధిక ప్రజానీకాన్ని ఉచితాల తాయిలాలకు అలవాటు చేసిన నేరం రాజకీయ నాయకులదే. ఏదైనా ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండదు. అలా తీసుకొని, తీసుకొని చివరకు వారు దానిని హక్కువలె భావించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇవాళ ఉచితాల హామీలు ఇస్తే తప్ప, ఓట్లు రాలవన్న అభిప్రాయానికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వచ్చేశాయి. ఏ దేశంలోనైనా ప్రజా సంపద వృద్ధి చెందుతూ పోవాలి కానీ, దానిని అందరికీ పునఃపంపిణీ చేస్తూ పోతే ఎలా? పేదలకు ఇవ్వడా నికి ధనవంతుల నుంచి తీసుకోవడం అనే ది క్షణికమైన సమానత్వ భావాన్ని మాత్ర మే ఇస్తుంది కానీ, పరోక్షంగా అది వారిని సోమరులుగా చేయడమే అవుతుంది. 

‘ఉచితం’ అన్నది ఏదైనా సరే మనుషులకు చేసుకోవడానికి తగిన పని లేనప్పు డు, సంపాదించుకోవడానికి వీలు లేనప్పుడు మాత్రమే ఉత్తమ కార్యం అనిపిం చుకుంటుంది. పని చూపించకుండా సొ మ్ములు ముట్ట చెబితే, లబ్ధిదారులకు పని తాలూకు ప్రోత్సాహకం తగ్గిపోతుంది.

‘ఉచితాలు’ ఏవైనా, ఎవరికైనా ఆర్థికంగా నిల కడలేనివి. ఎందుకంటే, అవి రేపు అధిక లోటులు, అప్పులు లేదా అధిక పన్నులకు మాత్రమే తోడ్పడతాయి. ఉచిత ప్రయోజనాలపై ఆధారపడిన ఏ సమాజమూ దీర్ఘకాలంలో ఆర్థిక పరిపుష్ట్ఠిని సాధించడంలో వెనుకబడుతుంది.  

ఆర్థిక వ్యవస్థకు హానికరం

మన దేశంలోని అనేక నగరాల్లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పట్టణ ప్రజ లలో ఉచితాలపట్ల మిశ్రమ వైఖరి వ్యక్తమైంది. పన్నుల రూపేణా వచ్చిన సొమ్ము తో రాజకీయ నాయకులు ఇలా ఉచితాల పేరుతో పంచేయడం, ఇంకా వారు జేబులోంచి ఒక్క పైసా ఖర్చు చేసుకోకుండా అన్ని అధికారిక సౌకర్యాలనూ ప్రభుత్వ వ్యయంతోనే అనుభవించడాన్ని కూడా అనేకమంది ప్రశ్నిస్తున్నారు.

సంపన్న వర్గాలకు చెందిన వారు  ఎక్కువగా (84శాతం) ఇలా ఉచితాలను అందించడం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా హానికరమని అభిప్రాయ పడుతున్నారు. అయితే, తక్కువ- ఆదాయ వర్గాలవారు మాత్రం (46శాతం) ‘తాము ప్రభుత్వం నుంచి ఏవో కొన్ని ఉచిత పథకాలనైనా పొందకపోతే ఎలా?’ అని ప్రశ్ని స్తున్నారు. పేదవారైతే, తమను ప్రభుత్వాలే అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆశిస్తున్నారు.

‘ఉద్యోగాలు, ఉపాధి మార్గా లు చూపించనప్పుడు మేమెలా బతకాలి?’ అన్న కొందరి వాదనలో వాస్తవికత ఉంది. పేద, దిగువ- ఆదాయ వర్గాలు నిత్యావసరాలపై, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పంట సాగు, చిన్న వ్యాపారాలు వంటివాటిపై సబ్సిడీలను ఇవ్వడాన్ని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. అయితే, ఇవికూడా దీర్ఘకాలం కొనసాగిస్తూ శాశ్వతంగా మార్చకూ డదని పలువురు అంటున్నారు.

పేదరిక నిర్మూలనలో భాగంగా, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వరకూ మాత్రమే ఉచితా లను పరిమితం చేయాలి. నీరు, విద్య, వైద్యం వంటి కనీసావసరాలను ఉచితంగా అందించడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు. కానీ, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సెల్‌ఫోన్లు, ఇతరత్రా యంత్రాలకు సైతం పెద్ద ఎత్తున సబ్సిడీలు, ఇంకా పూర్తి ఉచితంగా అందజేయడం వంటివి ప్రశ్నార్థకం అవుతున్నాయి.

సాపేక్షంగా తక్కువ స్థాయి అభివృద్ధి లేదా అధిక పేదరికం ఉన్న రాష్ట్రాల్లో, ఇటువంటి ఉచితాలను ఆర్థికవేత్తలు కొన్నాళ్లవ రకైతే సమర్థిస్తున్నారు. అలా కాక, ఎన్నికలకు ముందు ఉచిత రవాణా వంటి వాగ్దా నాలు చేయడం, వాటి అమలు కోసం కోట్లాది నిధులు వెచ్చించడాన్ని పలువురు విశ్లేషకులు అంగీకరించడం లేదు. 

అభివృద్ధికి ప్రత్యామ్నాయం కాదు

ప్రపంచ బ్యాంకు 2024 అక్టోబర్ నివేదిక ప్రకారం, సుమారు 12.9 కోట్లమంది భారతీయులు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. వారంతా రోజుకు కనీసం రూ. 500 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులపట్ల ప్రభుత్వం తన రాజ్యాంగ పరమైన బాధ్యతలను (నిర్దేశక సూత్రాలు) నెరవేర్చడానికి అందించే అనేక సేవలు కూడా ఉన్నాయి.

రాజకీయ పార్టీలు వాటిపట్ల దృష్టి పెట్టడం మంచిది. నిజానికి భారతదేశంలో ఉచితాలు కొత్తేమీ కాదు, చాలా కాలంగా ఉన్నాయి. గతంలో, ప్రభుత్వం సబ్సిడీలు, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర ముఖ్యమైన సేవల రూ పంలో ఉచితాలను అందించేది. ఉదాహరణకు పేద స్కూలు పిల్లలకు మధాహ్న భోజనం పెట్టడం వరకూ ఓకె.

కానీ, నిజం గా ఉన్నవాళ్లకు, లేనివాళ్లకు అందరికీ గం పగుత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం వృథా. ఉచిత మధ్యా హ్న భోజన పథకాన్ని 1956లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి కె. కామరాజ్ ప్రవేశపెట్టారు. ఒక దశాబ్దం తర్వాత అది జాతీయ స్థాయికి చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2 రూ. లకే కిలోబియ్యం పథకం వంటివీ జాతీయ స్థాయికి చేరాయి. ఇందుకోసమే రేషన్ కార్డుల వ్యవస్థ ఏర్పడింది. 

రాజకీయ సంస్కృతిగా మారరాదు

ఇటీవలి కాలంలో, ఉచితాలు భారత రాజకీయ సంస్కృతిలో అంతర్భాగంగా మారాయి. రాజకీయ పార్టీలు సైకిళ్ళు, ల్యాప్‌టాప్‌లు, టీవీ సెట్లు, చీరలు, కుట్టు యంత్రాలు, సోలార్ లైట్లు, ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్, నీరు, రేషన్లు, గ్యాస్ సిలిండర్లు, వృద్ధాప్య పెన్షన్, రుణరద్దు, నగదు ప్రోత్సాహకాలు, ప్రయాణం, వై-ఫై మొదలైన వాటితో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.

ఇంత సొమ్మును విరాళంగా ఇవ్వడాన్ని కొనసాగించడానికి రాజకీయ పార్టీల మధ్య పోటీ పెరుగుతున్నది. ఎన్నికల్లో విజ యం కోసం ఒకరిని చూసి మరొకరు రాజకీయ అధినేతలు ఉచిత పథకాల నిర్ణయా లు తీసుకుంటూ, అధికారంలోకి వచ్చాక అమలు చేయడానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఉచితా లు ఎన్నికలతో లేదా రాజకీయ పార్టీలతో ఎందుకు అనుసంధానితమవుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న?