ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
– కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శనివారం పరిశీలించారు. లబ్ధిదారులు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ నాణ్యత, సదుపాయాలు, ప్రభుత్వ సహాయం వినియోగంపై కలెక్టర్ సమగ్రంగా ఆరా తీశారు. ప్రభుత్వం పేదల స్వగృహ కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని ప్రాధాన్యంతో అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపులు జరుగుతున్నందున లబ్ధిదారులు పనులను ఆపకుండా కొనసాగించాలని సూచించారు. నిర్మాణంలో సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. తాడూరు మండలంలో 515 ఇళ్లలో 65 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఆలస్యం చేస్తున్న వారు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, స్థానిక సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.






