2 May, 2026 | 12:54 PM

బహుజనులు ఎందుకు తగ్గినట్టు?

09-02-2025 12:00 AM

భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల గురించి చర్చించవలసినప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అనివార్యంగా కులం గురించిన ప్రస్తావన తీసుకురాక తప్పదు. భారతదేశమంటేనే వివిధ కులాలతో కూడిన సామాజిక వ్యవస్థ కాబట్టి, ప్రభుత్వ పాలనా విధానంలో భాగంగా కులాల వారీగానే నేటి ఆధునిక సమాజంలోనూ పథకాలు ప్రవేశపెట్టడం అనివార్యమైంది.

కానీ, అఖండ భారతదేశాన్ని ఒకనాడు జంబూ ద్వీప గణరాజ్యం పేరుతో పరిపాలించిన అశోకుడి పరిపాలన కాలంలో కుల, మత, వర్గ తారతమ్య భేదాలు లేవని చరిత్ర చెబుతున్నది. ఒకనాడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ ప్రజాస్వామ్య గణతంత్ర విలువలతో ఉన్న మన దేశంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం సామాజిక వ్యవస్థలో కులాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జగమె రిగిన సత్యం.

బ్రిటిష్ వాళ్లుకూడా భారతీయ కులాల పునాదిగా చేసుకొనే విధివిధానాలు అమలయ్యాయి. ఎనలేని ప్రాముఖ్యం ఉంది కాబట్టే నేడు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు కులాలనుబట్టి తమ విధి విధానాలను, పార్టీ అజెండాలను రూ పొందిస్తున్నాయి. అందులో భాగంగానే మొన్నటి అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచారాలలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతామని హామీ ఇచ్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తప్పని పరిస్థితుల్లో కులగణన చేయడం కోసం మూడు నెలల క్రితమే ప్రక్రియ మొదలుపెట్టి, ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే పూర్తి చేశారు. అందులో భాగంగానే తాజాగా కులగణన వివరాలు బయట పెట్టారు. 

పదేళ్ల్లలో తగ్గిన బహుజనుల జనాభా

అయితే, కులగణనతో తెలంగాణ రాష్ట్రంలో నూతన విప్లవం వస్తుందని పాలక పక్షం, ప్రతిపక్షాలు భావించాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు, గత పదేళ్ల క్రితం నాడు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు చాలా వ్యత్యాసం ఉండటం తో పార్టీలు, కులమతాలకు అతీతంగా మేధావులకు, వి ద్యావంతులను ఆ లెక్కలు ఆశ్చర్యం తెప్పించాయి.

నాడు కేసీఆర్ ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా ఎస్సీ 18 శాతం ఉండగా, ఎస్టీ 10 శాతం, బీసీ 51 శాతం, ముస్లిం 13 శాతం, ఫార్వర్డ్ క్యాస్ట్ 8 శాతం ఉన్నారు. కానీ, తాజా కులగణన వివరాలు పరిశీలిస్తే బీసీ 46.25 శాతం, ఎస్సీ 17.43 శాతం, ఎస్టీ 10.45 శాతం, ఓసి 13.31 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం ఉన్నారు.

అంటే, గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా పెరిగింది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గడంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు, దళిత బహుజన మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో సమగ్ర కుటుంబ సర్వేలో 8 శాతం అగ్రకులాలు ఉండగా, నేడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో దాదాపుగా రెట్టింపు శాతం వారి జనాభా పెరగడం నమ్మశక్యంగా లేదు.

అగ్రకుల జనాభా పెరిగినప్పుడు అణగారిన వర్గాల జనాభా ఎందుకు పెరగదనే సహజ ప్రశ్న ప్రతిపక్ష పార్టీ నాయకులు, దళిత బహుజన నాయకులు లేవనెత్తుతున్న అంశం.కులగణన కూడా 96 శాతమే జరిగిందని ప్రభు త్వం తరఫు నాయకులు చెప్పారు. దాదాపు 16 లక్షల వరకు సర్వేకు సహకరించలేదని చెప్పారు. 

అయితే, ఆ సహకరించని వారుకూడా అగ్రకులాల వారని దళిత బహుజన నాయకుల వాదన. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఉద్దేశ పూర్వకంగానే అగ్రకుల జనాభా శాతాన్ని పెంచి, బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గించినట్టుగా నిరూపణ అవుతున్నది. తరతరాలుగా అత్యల్ప శాతంగా ఉన్న అగ్రకులాలు రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చెలాయిస్తున్నారనేది అందరికీ తెలిసిందే.

తాజా లెక్కల మూలంగా జరిగే నష్టం ఎవరికి అంటే మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకే. ఒకపక్క అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరినీ లెక్కించి రాజ్యంలోని సమస్త సంపదలో వాటాలు ఇవ్వాలని చెప్తుంటే, తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 35 నుంచి 40 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గించి చూపిస్తున్నది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్ వేదికగా తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన తాజా కులగణన సర్వే అంశాలని పరిశీలిస్తే 75 శాతమే ఉన్నారు. అంటే, 15 శాతం అణగారిన వర్గాలను బలి చేసినట్టుగా అర్థమవుతున్నది. 

ఎంపీ సీట్ల కోసం డిమాండ్ చేయాలి

తెలంగాణ సమాజంలో మెజార్టీగా అణగారిన వర్గాలే ఉన్నారనే సత్యం రుజువయితే వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి, తరతరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న వర్గాలు తమ రాజకీయ మనుగడను కాపాడుకో వడానికి వారి జనాభా వాటాను పెంచుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీల శాతాన్ని తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అదే విధంగా బీజేపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూలంగా ఎక్కువగా బీసీలకే విద్యా, ఉద్యోగ రంగాల్లో నష్టం జరుగుతున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాజిక న్యాయం చేస్తామని మార్పు కోసమే ఓట్లు వేయండని అడిగిన నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గెలిచాక సామాజిక న్యాయాన్ని విస్మరించారని మేధావులు, విద్యావంతులు విమర్శిస్తున్నారు.

ఇక భవిష్యత్తు లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుది,్ధ నిబద్ధత ఉంటే బీసీలకు జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో సీట్లు కేటాయించాలని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. 

 పుల్లెంల గణేష్