కృషీవలుడు
అక్షర యోధుడు, నిత్య చైతన్యదీప్తి, ప్రశ్నించే గొంతుక, ప్రజాపక్షపాతి రామోజీ రావును ఇలా ఎన్ని రకాలుగానైనా వర్ణించవ చ్చు. కృష్ణాజిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అనేక రంగాలకు విస్తరించిన ఓ మహా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎంతో పట్టుదల, అంతకు మించి ఆయా రంగాలపై అవగాహన ఉంటేనే సాధ్యమవుతుంది. అందునా, రామోజీరావు ఎంచుకున్న రంగాలు సైతం ఒక దానితో మరోటి సంబంధం లేనివి. కానీ, ప్రతి రంగంలోనూ ఆయన విజయం సాధించడమే కాదు, ఇతరులకు ఆదర్శంగానూ నిలిచారు.
‘మార్గదర్శి’ చిట్‌ఫండ్స్‌తో మొదలైన ఆయన ప్రస్థానం పత్రికా రంగానికి, ఆ తర్వాత సినీ, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు, చివరగా ‘ప్రియాఫుడ్స్’ దాకా కొనసాగింది. ఇప్పటికి ఆరు దశాబ్దాలుగా ‘మార్గదర్శి’ చిట్‌పండ్స్ రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతూనే ఉంది. ‘మార్గదర్శి’లో పెట్ట్టుబడి పెడితే తమ సొమ్ము ఎక్కడికీ పోదనే భరోసా జనానికి రావడానికి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఎన్నో ఆరోపణలు, కేసులు లాంటివి ఎదురయినా ఏనాడూ తాను నమ్మిన విలువలను వదలలేదు.
1969లో రైతులకోసం ప్రత్యేకంగా ‘అన్నదాత’ మాసపత్రికను ప్రారంభించారు. ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమే ఓ విప్లవం అని చెప్పాలి. 1974లో విశాఖపట్నంలో ఆ పత్రిక ప్రారంభమైన నాటికి అక్కడ ఏ పత్రికా లేదు. అలాంటి పరిస్థితుల్లో మారుమూల ఉత్తరాంధ్రలో దినపత్రికను ప్రారంభించడం నిజంగా సాహసమే. అంతేకాదు, అప్పటివరకు ఉన్న పత్రికా పోకడలకు భిన్నంగా తెల్లారేసరికి పాఠకుడి ముంగిట పేపర్ ఉండేలా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చింది కూడా ఈనాడే. మహిళలకు, విద్యార్థులకు ప్రత్యేక పేజీలు.. ఇలా తెలుగు జర్నలిజంలో ఎన్నెన్నో ప్రయోగాలకు నాంది పలికింది.
ఫలితంగా కేవలం నాలుగేళ్లలోనే అగ్రశ్రేణి దినపత్రిక స్థాయికి ఎదిగింది. దానికి అనుబంధంగా సితార, విపుల, చతుర పత్రికలూ వచ్చాయి. ఆ తర్వాత సినీ రంగంలోకీ అడుగుపెట్టిన రామోజీ ‘ఉషాకిరణ్’ బ్యానర్‌పై అనేక సినిమాలు తీశారు. లాభాల కోసం కాక విలువలున్న చిత్రాలను ప్రోత్సహించేందుకు ఆయన చిత్రాలను తీశారు. ఆరోగ్యకరమైన వినోదమే ప్రధానంగా ఆయన తీసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి.
‘ఈ టీవీ, మీ టీవీ’ అంటూ టీవీ చానల్‌ను ప్రారంభించి బుల్లితెరపై సైతం ఎన్నో ప్రయోగాలు చేశారు. మొదట పచ్చళ్లతో మొదలైన ప్రియాఫుడ్స్ సైతం ఓ పేరొందిన పరిశ్రమగా ఎదిగింది. ఇక, రామోజీ ఫిలిం సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం సినిమాను అక్కడే షూటింగ్ చేసుకునేలా తీర్చిదిద్దడమేకాక దేశంలోనే ఓ ప్రముఖ దర్శనీయ స్థలంగా మార్చారు.
ఇదంతా ఓ పారిశ్రామికవేత్తగా ఆయన సాధించిన విజయం అయితే ప్రజలకు ఎక్కడ, ఎప్పుడు కష్టమొచ్చినా ఆదుకోవడానికి స్వయంగా ముందుకు రావడమే కాదు, నలుగురికీ చేయూతనివ్వండని పిలుపునిచ్చేవారు. 1976లో దివిసీమలో వచ్చిన తుపాన్లు మొదలు విశాఖ హుద్‌హుద్ తుపాను దాకా తెలుగునాట వచ్చిన ప్రతి ఉపద్రవాల్లో ఆర్తులను ఆదుకున్నారు. దాతలద్వారా కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు.
ఒడిశా పెను తుపాను, గుజరాత్ భూకంపం, తమిళనాడు సునామీ, కేరళ వరదలు ఇలా పొరుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులను పెద్ద ఎత్తున ఆదుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు 20 కోట్ల విరాళం అందజేశారు. కృష్ణా జిల్లాలో పెదపారుపూడి, రంగారెడ్డి జిల్లాలో నాగన్‌పల్లి గ్రామాలను దత్తత తీసుకున్న ‘రామోజీ ఫౌండేషన్’ కోట్లాది రూపాయలు ఆ గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇన్ని విధాలా చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రామోజీని పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. భౌతికంగా మనకు దూరమైనా రామోజీ ఎప్పటికీ చిరంజీవే.






