11-02-2026 01:40:04 AM
‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాల్లో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కేవీ అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను దర్శకుడు అనుదీప్ మీడియాతో పంచుకున్నారు.
ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం?
‘ఫంకీ’ టైటిల్ వినడానికి క్యాచీగా ఉంటుంది. ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్‌ను ఎంచుకున్నాం. హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది.
విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉండబోతుంది?
విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్ర లో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది.
ఈ సినిమా జానర్, కథాంశం ఏమిటి?
జాతిరత్నాలకు భిన్నంగా ఉంటుందా?
‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ చిత్రం పూర్తి కొత్త గా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించాం. ప్రేమకథతోపాటు కుటుంబానికి సంబంధిం చిన మంచి భావోద్వేగ సన్నివేశాలూ ఉంటాయి. నిజ జీవితంలో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే సీన్స్‌తో అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా ఉంటుంది.
సినిమాలో లాజిక్ ఉంటుందా..?
ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లాజిక్ ఉండదని మీకు అనిపించవచ్చు. కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది.
‘జాతిరత్నాలు’ తరహా హాస్యం ప్రయత్నించి కొందరు విఫలమయ్యారు.. దానిపై మీ అభిప్రాయం?
మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నేను నమ్ముతా. ‘ఫంకీ’ కూడా సినీ నేపథ్యం అయినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు చేరువయ్యేలా రూపొందించాం.
ఈ సినిమాలో మీరు నటించారా..? భవిష్యత్తులో నటుడిగా మారే ఆలోచన ఉందా?
‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తా. నాకు నటుడిగా కంటే దర్శకుడిగా సినిమాలు చేయడమే ఆసక్తి. పూర్తిస్థాయి నటుడిగా మారే ఆలోచన లేదు. చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. దర్శకుడిగానే మరిన్ని సినిమా చేయాలనుంది.
మీరిలా కామెడీ సినిమాలే చేస్తారా?
విభిన్న తరహా సినిమాలు చేయాలని ఉంది. ‘ఫంకీ’లో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. కొన్ని సర్ ప్రైజ్‌లు కూడా ఉంటాయి.
ఈ సినిమాలో అతిథి పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు?
ఈ సినిమాలో దర్శకులు హరీశ్‌శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాం.
మీ గత చిత్రం ‘ప్రిన్స్’ ఫలితం
మీపై ఏమైనా ప్రభావం చూపిందా?
జయాపజయాలు సహజం. ఏ చిత్రానికైనా మం చి సినిమా చేస్తున్నామనే శాయశక్తులా కృషి చేస్తాం. అయితే ‘ప్రిన్స్’ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి అప్పుడు తగిన సమయం లేదు. ఇప్పుడు ‘ఫంకీ’కి టైమ్ తీసుకొని, మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం.
‘ఫంకీ’ కథ మొదట ఎవరికి వినిపించారు?
నిర్మాత నాగవంశీకి మొదట ఈ కథ వినిపించా. ఆయనకు కథ నచ్చి, వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు.
త్రివిక్రమ్ సినిమా చూశారా?
నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి?
భీమ్స్‌తో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఆయన దర్శకులకు విలువ ఇస్తారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ‘ఫంకీ’కి అద్భుతమైన సంగీతం అందించారు.
మీ తదుపరి చిత్రాలు?
మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నా. వెంకటేశ్ కోసం మరో కథ సిద్ధం చేస్తున్నా.