రామోజీకి అంతిమ వీడ్కోలు
- అధికార లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు
హైదరాబాద్, జూన్ 9 ( విజయక్రాంతి) : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శని వారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ఇంటికి తరలించారు. కుటుంబసభ్యులు కడసారి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం తపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత పార్ధివదేహాన్ని ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం తరలించి అంతిమ సం స్కారాలు నిర్వహించారు.
అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం రామోజీ పెద్ద కుమారుడు కిరణ్ ఆయన చితికి నిప్పంటించడంతో రామోజీ అంత్యక్రియలు ముగిశాయి. కాగా, రామోజీ నివాసం నుంచి కొనసాగిన అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ సహా గ్రూప్ ఉన్నత ఉద్యోగులు పాడెమోశారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనీయర్ ఐఏఎస్ అధికారులు రజిత్ భార్గవ్, ఆర్పీ సిసోడియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, సీనియర్ నటుడు మురళీ మోహన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
పీఆర్‌ఎస్‌ఐ ఘన నివాళి
రామోజీరావు మరణం పట్ల పబ్లిక్ రిలేషన్ సైసోటీ ఆఫ్ ఇండియా(పిఆర్‌ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవ ప్రశంసనీయమని పేర్కొన్నది. ఒక మధ్యతరగతి వ్యక్తి క్రమశిక్షణతో సమున్నత శిఖరాలకు ఎలా ఎదగవచ్చో ఆయన జీవిత సమారాన్ని నేర్చుకోవచ్చని పేర్కొంది. ప్రజల్లో స్ఫూర్తి నింపి శ్రమించి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తయారు చేసిన ఆయన లోటు తీర్చలేనిదని పిఆర్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్స్ అన్నారు. రామోజీరావు సతీమణి రమాదేవి, ఈనాడు ఎండి కిరణ్, యావత్ కుటుంబానికి వారు ప్రగాఢ సానూభూతి తెలుపుతూ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది.






