వానకాలానికి 15 లక్షల టన్నుల ఎరువులు
- రాష్ట్రవ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగు
ఇప్పటికే 12 లక్షల టన్నులు జిల్లాలకు దిగుమతి
మరో 3 లక్షల టన్నుల
ఎరువులు సరఫరాకు ప్లాన్
మల్టినేషనల్ కంపెనీలతో క్రిమిసంహారక మందులకు ఒప్పందాలు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): వానకాలం సీజన్ ప్రారంభకావడంతో రైతులకు సరిపడా ఎరువులను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది. వారం రోజుల క్రితం 32 జిల్లాలకు ఎరువులను సరఫరా చేసినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, సుమారు 15 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఇప్పటివరకు 12 లక్షల టన్నుల ఎరువులను గోదా zములకు తరలించారు. నాలుగైదు రోజుల్లో మరో 3 లక్షల టన్నుల ఎరువులను సిద్ధం చేసి సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మార్క్‌ఫెడ్ తెలిపింది. రైతులు విత్తనాలు వేసే సమయానికి పూర్తిగా ఎరువులను చేరవేసేందుకు ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటివరకు 6.80 లక్షల టన్నుల యూరి యా, 75 వేల టన్నుల డీఏపీ, 4 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 24 వేల టన్నుల పోటాష్ దిగుమతి చేసినట్టు అధికారులు తెలిపారు. రైతులు పత్తి, వరి, మొక్క జొన్న, కంది, మిర్చి పంటలు పెద్దమొత్తంలో సాగు చేస్తారని, సోయాబిన్, మినుములు, ఉలవలు, కుసుమలు వంటి పంటలు తక్కువగా పండిస్తారని అధికారులు వెల్లడించారు. గతేడాది వానకాలంలో 1.20 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 13 లక్షల ఎరువులు సరఫరా చేయగా, యాసంగిలో 90 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, 11 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసింది. ఈ ఏడాదిలో పంట విస్తీర్ణం పెరగడంతో ఎక్కువ మొత్తంలో ఎరువులు వినియోగిస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
ఎరువుల కోసం ఆందోళన వద్దు
ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వలు ఉన్నట్టు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. కొంతమంది దళారులు ఎరువుల కొరత ఉందని తప్పుడు ప్రచారం చేసి, ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నాలు చేస్తారని, వారి మాటలు నమ్మవద్దని సూచిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎరువుల సరఫరా కొద్దిగా ఆలస్యమైందని, అయిన సకాలంలో చేరవేస్తామని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు అమ్మే దుకాణాలు ఉంటే స్థానిక వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఎరువుల కంపెనీలతోపాటు పంటలకు సోకే పురుగులను నిర్మూలించేందుకు మల్టినేషనల్ కంపెనీలతో క్రిమిసంహారక మందుల కోసం ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.






