08-02-2026 12:00:00 AM
‘లైఫ్ సైన్సెస్’లో పెట్టుబడుల వరద
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే కీలక గమ్యస్థానంగా నిలుస్తోంది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు సంవత్సరాల్లో 190 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
మొత్తం పెట్టుబడుల విలువ సుమారు రూ. 73,360 కోట్లకు చేరగా, దీని ద్వారా లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు యువతకు లభించా యి. అమెరికా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన గ్లోబల్ దిగ్గజ సంస్థలు హైదరాబాద్, జీనోమ్ వ్యాలీని తమ ఆసియా, ప్రపంచ స్థా యి కేంద్రాలుగా ఎంచుకున్నాయి. ఇది రాష్ట్ర పరిశ్రమల విధానానికి, పెట్టుబడులకు అనుకూల వాతావరణానికి నిదర్శనంగా మారింది.
ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగ కంపెనీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మెడికల్ డివైసెస్ రంగంలో అగ్రగామి మెడ్ట్రానిక్, బయోఫార్మా సంస్థ అమ్జెన్, ఫార్మా దిగ్గజాలు సానోఫీ, ఎలి లిల్లీ, జాన్సన్ అండ్ జాన్సన్, హెచ్?సీఏ హెల్త్?కేర్ వంటి సంస్థలు రాష్ర్టంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, ఆర్‌డీ హబ్‌లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేశాయి.
భారీ పెట్టుబడులు.. లక్షకుపైగా ఉద్యోగాలు
మెడ్‌ట్రానిక్ సంస్థ ఒక్కటే రూ.2,905 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పించింది. సానోఫీ సంస్థ విస్తరణ ద్వారా రూ.3,600 కోట్ల పెట్టుబడులు వచ్చి 2,600 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలో పేరొందిన ఎలి లిల్లీ సంస్థ భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లోనే తన తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం రాష్ట్రానికి గౌరవంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
పరిశ్రమలకు అనుకూ ల వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటమే ఈ పెట్టుబడులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నా రు. రానున్న రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీ లు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీనోమ్ వ్యాలీ కేంద్రంగా బయోటెక్ రంగం వేగంగా విస్తరిస్తోంది.
వ్యాక్సిన్ తయారీ, సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్, ఏఐ ఆధారిత ఫార్మా పరిశోధనలు ఇక్కడ ఊపందు కున్నాయి. జపాన్‌కు చెందిన టకెడా సంస్థ డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఇక్కడే తయారీ చేస్తోంది. భారత్ బయోటెక్ ఆధునిక సెల్ అండ్ జీన్ థెరపీ ప్లాంట్, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లాంట్ సంస్థ రూ.2,000 కోట్ల పెట్టుబడితో చేపట్టిన భారీ ప్రాజెక్టులు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాయి.
పారిశ్రామిక సుస్థిరాభివృద్ధి మోడల్‌గా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫార్మా సిటీలో ఇప్పటివరకు రూ.23,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 40వేలకుపైగా ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమమైంది. పర్యావరణహిత పరిశ్రమలతో తెలంగాణ సుస్థిర అభివృద్ధికి మోడల్‌గా నిలుస్తోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఏర్పడుతున్న ఆర్ అండ్ డీ కేంద్రాలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, తయారీ యూనిట్లు రాష్ట్ర యువతకు హైస్కిల్ ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయి.
బయో ఏసియా-- బయో ఏసియా-- సదస్సుల్లో అనేక గ్లోబల్ కంపెనీలు తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్, అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలు వేగంగా అమలు అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా తెలంగాణను ప్రపంచంలోని టాప్--5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పాలసీతో రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో లైఫ్ సైన్సెస్ రంగం తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారింది. పెట్టుబడులు, ఉపాధి, అంతర్జాతీయ గుర్తింపుతో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే హెల్త్‌కేర్ లైఫ్ సైన్సెస్ రంగానికి రాజధానిగా ఎదుగుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.