27 July, 2026 | 3:10 AM

కన్నెపల్లి, పాలమూరు ఎత్తిపోతల మోటార్లు వెంటనే ప్రారంభించాలి

27-07-2026 02:40 AM

రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు సాగునీరు అందించాలి.. 

నిర్లక్ష్యం చేస్తే రైతాంగం ఆగ్రహం తప్పదని హెచ్చరిక

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి, పాలమూరు ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్ చేసి, వాటి పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని ఆదివారం ఒక ప్రకటన ద్వారా కోరారు.

ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలని, అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే సాగునీటి విడుదల చేపట్టాలని, లేకపోతే రైతాంగం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.