కలెక్టర్ మేడం.. మా గోడు వినండి
కొత్త కలెక్టర్ కు వినతుల వెల్లువ
మహబూబాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రెండేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం.. అర్జీలు ఇచ్చుడే తప్ప పరిష్కార మార్గం ఇప్పటివరకు చూపలేదు.. కలెక్టర్ మేడం కొత్తగా వచ్చిన మీరైనా మా సమస్యకు పరిష్కారం చూపండి అంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజ్ఞప్తులు, ఫిర్యాదులు అందజేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ వాటికి మోక్షం లభించలేదని, కొత్తగా వచ్చిన కలెక్టర్ మేడం తమకు దారి చూపుతుందని ఆశతో వచ్చామని పలువురు బాధితులు పేర్కొన్నారు. కొత్తగా బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజల నుండి దరఖాస్తులు, ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు సిఫారసు చేసి సమస్య పరిష్కారం చేయుటకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో స్వీకరించిన 107 దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో క్రిష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డివిహెచ్‌ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ హరిప్రసాద్, ఎక్సైజ్ ఎస్పి కిరణ్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




