4 April, 2026 | 2:44 AM

మరణంలోనూ వీడని స్నేహం

04-04-2026 01:02 AM

నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

మహబూబాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): చిన్నతనం నుండి కలిసిమెలిసి ప్రాణ స్నేహితులుగా మెదులుతున్న ఇద్దరు విద్యార్థులు జాత రకు వెళ్లి తిరిగి వస్తుండగా సైకిల్ కడిగేందుకు వాగులోకి దిగి ప్రమాదవశాత్తు ఇద్దరూ మిత్రు లు ప్రాణాలు వదిలిన ఘటన జనగామ జిల్లా చిలుపూరు మండలం వంగాలపల్లి లో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన నూనె మనోజ్ (12), గూటం అకిరా నందన్ (13) చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు.

ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం సైకిల్ పై నష్కల్ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆకేరు వాగులో సైకిల్ కడిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో జారిపడి దుర్మరణం పాలయ్యారు. వాగు వద్ద సైకిల్, చెప్పులు కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి గాలింపు చేపట్టగా ఇద్దరు బాలురు నీటిలో మునిగిన ఘటన వెలుగు చూసింది. మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాలను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పరామర్శించి ఓదార్చారు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగిన మిత్రులు మరణంలోనూ తమ స్నేహాన్ని వీడలేదంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు.