12 June, 2026 | 3:10 AM

సర్కారు బడి.. సకల వసతులు కూర్చబడి..

12-06-2026 01:49 AM
  1. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు      
  2. ఉపాధ్యాయులే ఆ బడులకు ప్రధాన బలం
  3. ప్రభుత్వ పాఠశాలలల్లో విప్లవాత్మక మార్పులు
  4. పాఠశాలల అభివృద్ధికి  ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రజా ప్రతినిధులు
  5. విద్యార్థులను పంపేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు               

చిట్యాల, జూన్ 11 : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యకు కేంద్ర బిందువులుగా నిలిచేవి. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటి పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ పాఠశాలల్లో చదివిన వారిలో నేడు ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. కానీ కాలక్రమేణా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరగడం, భారీ ప్రకటనలు, ఆకర్షణీయ ప్రచారాలతో తల్లిదండ్రులు ప్రైవేట్ విద్య వైపు మొగ్గు చూపారు.

ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. అయితే ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం, గ్రామ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే లక్ష్యంతో కొన్ని గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామాల్లోకి అనుమతించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ చర్యల వెనుక ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచడం, గ్రామ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉందని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

ఉపాధ్యాయులే ప్రధాన బలం 

ప్రభుత్వ పాఠశాలల ప్రధాన బలం అక్కడ పనిచేసే ఉపాధ్యాయులే. టెట్, డీఎస్సీ వంటి కఠినమైన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నిర్వహిస్తున్నారు. వేలాది మంది అభ్యర్థుల మధ్య పోటీని ఎదుర్కొని ఎంపికైన ఈ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తరచూ వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంచడం, వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకురావడం, ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు

 ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే పాత భవనాలు, తక్కువ సౌకర్యాలు అనే భావన ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ క్లాస్రూమ్లు, స్మార్ట్ టీవీలు, ఆంగ్ల మాధ్యమ బోధన,  పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, క్రీడా మైదానాలు, కంప్యూటర్ విద్య, గ్రంథాలయాలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని వాతావరణంలో చదువుకునే అవకాశాన్ని విద్యార్థులు పొందుతున్నారు.

ఉచితంగా లభిస్తున్న అనేక సదుపాయాలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అనేక ఉచిత సౌకర్యాలను కల్పిస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, విద్యా సామగ్రి వంటి వాటిని ఉచితంగా అందిస్తోంది. దీని వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, బస్సు ఛార్జీలు, ప్రత్యేక కార్యక్రమాల పేరుతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇవన్నీ లేకుండానే నాణ్యమైన విద్య అందుతోంది.

విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం

ప్రభుత్వ పాఠశాలలు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కావడం లేదు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. క్రీడలు, సైన్స్ ఫెయిర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నాయి. జాతీయ పండుగలు, పర్యావరణ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయి.

తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి..

కేవలం పెద్ద భవనాలు, ఆకర్షణీయ యూనిఫాంలు, ప్రచార ప్రకటనలు చూసి పాఠశాలను ఎంపిక చేయకుండా అక్కడి బోధన, ఉపాధ్యాయుల నైపుణ్యం, విద్యార్థుల ఫలితాలను కూడా పరిశీలించాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య ముఖ్యమని, అది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సమర్థవంతంగా అందుబాటులో ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అనేది కేవలం ప్రభుత్వానికి చెందిన భవనం కాదు. అది గ్రామ ప్రజల ఆస్తి. దానిని కాపాడుకోవడం, అభివృద్ధి చేయడం ప్రతి గ్రామస్థుడి బాధ్యత. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడితే విద్యా రంగంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని నిపుణులు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ప్రభుత్వ పాఠశాలలలోనే పిల్లలను చేర్పించాలి

 ప్రైవేట్ పాఠశాలలు ప్యాకెట్ పాలలాంటివైతే, ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛమైన ఆవుపాల లాంటివి. ప్యాకెట్ పాలు ప్రధానంగా టీ తయారీకి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆవు పాల నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి అనేక విలువైన ఉత్పత్తులు ఏ విధంగా అయితే లభిస్తాయో,  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వంటి అనేక నైపుణ్యాలను వెలికి తీయవచ్చు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసుకోవడం గ్రామస్తులందరి బాధ్యత,

ప్రతి కుటుంబం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు సహకరించాలి. చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, బలోపేతం కోసం గ్రామస్తులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. విద్యార్థుల చేరికలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించి, విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం.

 కాటం వెంకటేశం. (పెద్ద కాపర్తి సర్పంచ్)

నా ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడికి తోలుతున్నా..

గత సంవత్సరం మా ఇద్దరు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాం. అయితే వేలకు వేలు ఫీజులు చెల్లించినప్పటికీ పిల్లల్లో ఆశించిన స్థాయిలో నైపుణ్యాల అభివృద్ధి కనిపించలేదు. ఈ ఏడాది మా  గ్రామ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని, స్వయంగా పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. ఆయనపై నమ్మకంతో మా ఇద్దరు పిల్లలను ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకే తొలుతున్నా. 

 లింగస్వామి, విద్యార్థుల తండ్రి.