20-02-2026 12:59:09 AM
హనుమకొండ, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఎన్ని కల సరళిని ఓటింగ్ విధానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోతున్నట్లుగానే కనిపిస్తోందని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మొత్తం పోలైన 37 లక్షల ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 15 లక్షల ఓట్లని సాధిస్తే, బీఆర్‌ఎస్ 11 లక్షల ఓట్లని, బీజేపీ ఐదు లక్షల ఓట్లను సాధించాయన్నారు.
అంటే పాలక పక్ష కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి ఎక్కువ ఓట్లు సాధించాయి. కాబట్టి మెజార్టీ ప్రజ లు కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని స్ప ష్టం అవుతుందని స్పష్టం చేశా రు. పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రె స్ పార్టీకి ప్రతిపక్షాలు కూడా గట్టి పోటీ ఇచ్చాయని, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కి స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కాయని డాక్టర్ తిరుణహరి శేషు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థి సగటున రూ.20లక్షల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేశారని, అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్‌లలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలిచారన్నారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఖర్చు చేస్తున్నా ఎన్నికల కమిషన్, పోలీస్ డిపార్ట్‌మెంటు చోద్యం చూడటం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని డాక్టర్ తిరుణహరి శేషు విమర్శించారు.