వాంఖడేలో హైవోల్టేజ్ ఫైట్
- ముంబైతో ఆర్‌సీబీ ఢీ
- రోహిత్, కోహ్లీలపైనే అందరి చూపు
ముంబై, ఏప్రిల్ 11 : ఐపీఎల్ లో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఇరు జట్లు ఎప్పుడు తలపడినా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముంబై జట్టులో రోహిత్ శర్మ, అటు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ మధ్య జరిగే ఈ మెగా ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడు మ్యాచ్ లలో 2 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అటు ముంబై ఇండియన్స్ మాత్రం మూడు మ్యాచ్ లలో కేవలం ఒకే విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.హోంగ్రౌండ్ లో ఆడనుండడం ముంబైకి అడ్వాంటేజ్ కానుంది. రోహిత్ శర్మ, రికెల్టన్ రాణిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా ఇంకా పూర్తిస్థాయి ఫామ్ అందుకోలేదు.
అలాగే నమన్ ధీర్, రూథర్ ఫర్డ్ కూడా బ్యాటింగ్ లో కీలకంగా చెప్పొచ్చు. బౌలింగ్ లో బుమ్రా ఇప్పటి వరకూ తన మార్క్ చూపించలేదు. గత మ్యాచ్ లో ముంబై బౌలర్లు పేలవ ప్రదర్శన కవబరిచారు. రాజస్థాన్ పై సమిష్టిగా విఫలమయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్ లో బౌలింగ్ గాడిన పడితే తప్పు గెలుపుపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్సీబీ మాత్రం సత్తా చాటుతోంది. వరుస రెండు విజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి ఆర్సీబీకి షాక్ ఇచ్చింది.
బ్యాటింగ్ లో తడబాటుకు గురైనప్పటకీ కెప్టెన్ పటిదార్ , షెఫర్డ్ ఆదుకోవడంతో కోలుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ, ఫిల్ సాల్ట్ నుంచి మంచి ఆరంభాన్ని ఆర్సీబీ కోరుకుంటోంది. అటు బౌలింగ్ లో కృనాల్ పాండ్యా వికెట్లు తీస్తుండగా.. పేస్ విభాగంలో భువనేశ్వర్, హ్యజిల్ వుడ్ కీలకంగా ఉన్నారు. గత మ్యాచ్ లో నిరాశపరిచినప్పటకీ వీరి బౌలింగ్ ను తక్కువ అంచనా వేయలేం. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే వాంఖడే స్టేడియంలో బ్యాటర్లదే పైచేయి కానుంది.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్(కీపర్),తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్థూల్ ఠాకూర్, బౌల్ట్, బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ(కీపర్), షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్




