పంజాబ్ ధనాధన్
- చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
- చెత్త బౌలింగ్‌తో పరాజయం
* ఎంత భారీ స్కోరు చేసినా సరైన బౌలింగ్ లేకుంటే ఏం లాభం... మ్యాచ్‌లలో విజయాలు అందవు. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ప్రతీసారీ నెగ్గుకురాలేమన్నది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరోసారి తెలిసొచ్చింది. పంజాబ్ కింగ్స్ పై 219 పరుగులు చేసి చెత్త బౌలింగ్‌తో చిత్తుగా ఓడిపోయింది. అటు టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో భారీ టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన పంజాబ్ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 11 : ఐపీఎల్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. సొంతగడ్డపై మరో విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యా లో మొదట బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. లక్నోతో మ్యాచ్‌లో నిరాశపరిచిన వీరిద్దరూ పంజాబ్‌పై మాత్రం విశ్వరూపం చూపించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. దీంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలోనే 102 పరుగులు చేసింది. హెడ్ (38) పరుగులకు ఔటవగా... అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 74 (5 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులు చేశాడు. హెడ్ , అభిషేక్ తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలోనే 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వెంటవెంటనే ఔటవ్వడంతో సన్‌రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడినా.. హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ కొంపముంచాడు.
33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 39 పరుగులే చేశాడు. దూకుడుగా ఆడుతున్న అనికేత్ వర్మ రనౌట్‌కు కూడా క్లాసెన్ కారణమయ్యాడు సలీల్ అరోరా నిరాశపరచడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులే చేయగలిగింది. పవర్ ప్లేలో ఆ జట్టు స్కోరు చూసిన తర్వాత కనీసం 250 పైన కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి 5 ఓవర్లలో కేవలం 37 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ కాస్త దూకుడుగా ఆడి ఉంటే మరో 20 పరుగులు అదనంగా చేసి ఉండేది. పిచ్ ఫ్లాట్ గా ఉండడంతో భారీ టార్గెట్ ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది.
సన్ రైజర్స్ కు ధీటుగా ఆడుతూ పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరినీ కట్టడి చేయడం హైదరాబాద్ బౌలర్ల వల్ల కాలేదు. దీంతో పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ 93 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 20 బంతుల్లోనే 57 (5 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేయగా.. తొలి వికెట్ పార్టనర్ షిప్ 99 పరుగులు నమోదైంది. అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా 25 బంతుల్లోనే 51 (4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు.
వీరిద్దరూ ఔటైన తర్వాత కూపర్ కన్నోలి (11) పరుగులకే వెనుదిరిగినా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు నేహల్ వధేరా కూడా రాణించడంతో పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తమ బౌ లింగ్ ఎంత చెత్తగా ఉందో ఈ మ్యాచ్ ద్వారా నిరూపించారు. శ్రే యాస్ 69 (33 బంతుల్లో) రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
స్కోరు బోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 219/6 ( అభిషేక్ శర్మ 74, క్లాసెన్ 39, హెడ్ 38 ; శశాంక్ సింగ్ 2/20, అర్షదీప్ సింగ్ 2/50)
పంజాబ్ కింగ్స్: 223/4 ( శ్రేయాస్ అయ్యర్ 69 నాటౌట్, ప్రియాన్ష్ ఆర్య 57, ప్రభ్‌సిమ్రన్ 51; శివాంగ్ 3/33, దూబే 1/38)




