16 May, 2026 | 11:56 AM

చిన్న సినిమాను చిదిమేస్తున్న భారీ బడ్జెట్

16-02-2025 12:00 AM

ఒక నిర్మాత కష్టం.. తెరపై కనిపించే ఎందరో నటీనటుల భవిష్యత్.. తెరవెనుక ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణుల శ్రమ.. ఇవన్నీ కలిస్తేనే సినిమా. అయితే నాడు-నేడు సినిమా తీసే విధానంలో చాలా మార్పులొచ్చాయి. ‘గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది’ అని నాడు పాడినా.. నేడు ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ అంటూ పాడినా ప్రేక్షకులు అమితంగా ఆదరించారు.

పున్నమి వెన్నెలలో కొలనులో కలువల మధ్య జలకాలాడి బయటకు వస్తున్న అప్సరసలాంటి అందమైన హీరోయిన్ మోము చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. అలాగే చిచ్చు బుడ్డి వెలుగులో చప్పట్లు కొడుతూ లేడి పిల్లల గెంతుతున్న హీరోయిన్‌ను చూసి మురిసిపోయారు. వీటన్నింటికీ చాలా ఖర్చు తక్కువ.

ఆ పాటలైనా ఎవర్ గ్రీన్.. ఆ హీరోయిన్లను చూసిన ప్రేక్షకుల మనసులో పడిన ముద్రా ఎవర్ గ్రీన్. మరి ఎందుకీ అద్దాల మేడలు, ఆకాశ హర్మ్యాలు? కోటలాంటి సెట్లు.. కొండంత బడ్జెట్లు.. సినిమా ఎక్కడికి పోతోంది? ఈ భారీ బడ్జెట్ సినిమాలకు అంతమెక్కడ? తెలుగు సినిమా బడ్జెట్ పోకడపై స్పెషల్ స్టోరీ మీకోసం..

సినిమాలోని ఏదైనా సన్నివేశం చూస్తే కళ్లు రెండింతలవ్వాలి.. మనసులో అది ముద్ర పడిపోవాలి. ఎప్పుడు ఆ సన్నివేశం గురించి చర్చించినా చెబుతున్న కళ్లు అదే ఎక్స్‌ప్రెషన్‌ను కానీ నేటి సినిమాకు అంత సీన్ ఉందా? ప్రస్తుతం జనాలు తిరిగి వెనుకటి ప్రపంచానికి పరుగులెత్తుతుంటే.. తెలుగు సినిమా మాత్రం లెక్కపెట్టలేనన్ని చుక్కల నడుమ దేదీప్యమానంగా వెలుగుతున్న చంద్రుడి కాంతులను వీడి క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం పరుగులు తీస్తోంది.

వీకెండ్ వస్తే నగర జనాభా కార్లు వేసుకుని ప్రకృతిని వెదుక్కుంటూ వెళుతుంటే.. తెలుగు సినిమా మాత్రం ప్రకృతిని వీడి కృత్రిమత్వాన్ని వెదుక్కుంటూ వెళుతోంది. నాడు చంద్రుని వెలుగులో కేవలం ఒక మల్లె తీగ చివర హీరోయిన్ మోమును తాకుతుండగా వచ్చే పాటను చూస్తే అది మనసులో ముద్రితమై ఎప్పటికీ చెరిగేది కాదు. కానీ ఇప్పుడు వేస్తున్న రూ.కోట్లతో వేస్తున్న సెట్లు మన మనసులో ఒకరోజైనా  స్థానం సంపాదించలేకపోతున్నాయి.  

‘మాయాబజార్’ను మరువగలరా?

‘కీలుగుర్రం’ సినిమా 1949లో వచ్చింది. ఆ చిత్రంలో కీలుగుర్రం ఎగురుతూ ఉంటే అదెలా సాధ్యమని ప్రేక్షకులు కళ్లు రెండింతలు చేసి నోరెళ్లబెట్టి మరీ చూశారు. ఇప్పుడు ఏ సెట్‌ను చూసైనా అలా చేయగలుగుతున్నారా? అదంతా సర్వ సాధారణమైపోయింది. ఎంత గొప్ప సీన్ చూసినా ప్రేక్షకుడిలో మార్పేమీ కనిపించదు.

ఎందుకంటే అదంతా తావీదు మహిమలా గ్రాఫిక్ మహిమ అని మనందరికీ తెలుసు. మయసభ సెట్ వేస్తే అంతా అది చూసి అబ్బురపడ్డారు. దానిని అప్పటి ప్రజలు తమ జీవితకాలం మరిచిపోలేదు. మాయానగరాన్ని సృష్టించిన ‘మాయాబజార్’ను ప్రేక్షకులు మరువగలరా?..

అంతెందుకు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవలోకం నుంచి అలా దిగి వస్తున్న శ్రీదేవిని ఎవరైనా మరచిపోగలరా? లాస్ట్ సీన్‌లో జంతువుల మధ్య దేవకన్యలా కూర్చొన్న ఆ ముగ్ద మనోహర రూపాన్ని మరచిపోగలమా? ఒక చెట్టు.. దాని కింద శ్రీదేవి.. ఖర్చు ఎంత అయ్యుంటుంది? చాలా తక్కువే కదా.

ఈ సినిమా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మరచిపోలేదు. మరి ఇప్పుడు ఏ సెట్ వేసినా ఆ మూడు గంటలో.. మహా అయితే మూడు రోజులు చెప్పుకుంటారు. అంతకు మించి దానికి మదిలో నిలిచేంత సీన్ లేదు. కానీ బడ్జెట్‌లో ఎంత తేడా? 

చిన్న సినిమా చతికిలపడుతోంది..

ఒక సినిమా తీయడమే ప్రస్తుత పరిస్థితుల్లో గగనమంటే వాటిని ప్రమోట్ చేసుకోవాలన్నా భారీగా ఖర్చు పెట్టాల్సిందే. పెద్ద హీరో.. పెద్ద నిర్మాణ సంస్థతో టైఅప్ అయితే తప్ప చిన్న సినిమా బతికే పరిస్థితి లేదు. సినిమా తీసి.. దానిని ప్రమోట్ చేసుకోలేక.. కనీసం విడుదల కూడా చేయలేక చిన్న సినిమా చితికిపోతోంది.

ఒక సినిమాకు యాంటీ రివ్యూ వస్తే విలవిల్లాడే సినీ పెద్దలు.. చిన్న సినిమాకు చితి పేరుస్తున్నది మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఒక దశాబ్ద కాలం క్రితం భారీ బడ్జెట్ సినిమాలు ఒకటో అరో ఉండేవి. ఇప్పుడు పెద్ద దర్శకులంతా తీస్తే భారీ బడ్జెట్టే. ఒకరకంగా చెప్పాలంటే చిన్న సినిమాలు ఓటీటీ దయ వల్ల అంతో ఇంతో బతుకుతున్నాయి కానీ లేదంటే ఈ భారీ బడ్జెట్ సినిమాల ధాటికి వాటి పరిస్థితి అస్సామే.

అవి తీసిన వారి పరిస్థితి దయనీయమే. ప్రేక్షకుల మనసులో ఎన్నటికీ చెరగని ముద్ర వేసే సినిమాలను తక్కువ బడ్జెట్‌లో తీయడమెలాగో దర్శకులు ఆలోచించాలి. అప్పుడే అద్భుతమైన సినిమా తీయాలనే ఆలోచన ఉన్నవారు కూడా ధైర్యంగా ముందుకు వస్తారు. లేదంటే మీ పెద్ద సినిమాల మాయాజాలాన్ని చూసి ఆలోచనను ఆదిలోనే చంపేసుకుంటారు. ఒక మంచి ఆశయం.. మరెన్నో ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. 

కథలో దమ్ము లేకా?

నాడు పది వేలైతే.. నేడు పది లక్షలవ్వాలి. కానీ వం దల కోట్లవుతోంది. ఎం దుకింత తేడా? అంత బడ్జెట్‌తో తీస్తేనే సినిమాలు ఆడతాయా? లోబడ్జెట్ చిత్రాలు ఆడవా? అంటే అ ద్భుతంగా ఆడతాయి. ‘గోదావరి’, ‘ఆనంద్’ వంటి చిత్రాలు డీసెంట్ హిట్ కొట్టా యి. ఇటీవలి కాలంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలు భారీ బడ్జెట్‌తో తీసినవేమీ కాదు. అయినా సరే.. వసూళ్ల సునామీ సృష్టించాయి.

జానర్స్‌ను బట్టి భారీ బడ్జెట్ అవుతుందనుకున్నా.. నాటి పౌరాణిక చిత్రాల్లో వేసిన సెట్స్‌తో పోలిస్తే నేడు వేస్తున్న సెట్స్ ఏ పాటి? అసలింత భారీ బడ్జెట్ ఎందుకు? ఎవరి కోసం? కథలో దమ్ము లేక సెట్స్‌తో మాయ చేస్తున్నారా? భారీ బడ్జెట్‌తో పనేముంది? అటు ఇటు అయితే నిర్మాతకు ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కనిపించడం తప్ప.

భారీ బడ్జెట్ చిత్రాలను తీసి కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచి మరీ ప్రేక్షకులపైకి వదులుతున్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ పేరుతో ఆకాశానికి నిచ్చెనలు వేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమా చతికిలపడుతోంది. 

 ప్రజావాణి చీదిరాల