16 May, 2026 | 12:52 PM

నా కెరీర్ బెస్ట్ మూవీ ఇదే!

16-02-2025 12:00 AM

పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించనుండగా, నిధి అగర్వాల్ పంచమి అనే యువరాణి పాత్రను పోషిస్తోంది.

రెండు భాగాల్లో రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, నిధి అగర్వాల్ తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘సినిమాలోని కొన్ని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి.

కథ కూడా చాలా వేగంగా ఉంటుంది. పూర్తి సినిమా ఔరంగజేబు ట్రాక్‌పైనే ఆధారపడి ఉండదు. అది ఒక భాగం మాత్రమే. నా పాత్ర కేవలం డ్యాన్స్‌కు మాత్రమే పరిమితమయ్యేది కాదు.. చాలా ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్ షూటింగ్ తొలి రోజుది. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఉత్తమమైంది.

పవన్‌కల్యాణ్ నటన చూసిన ఒక్కోసారి ఆశ్చర్యపోయేదాన్ని. ఎంత కష్టమైన సన్నివేశమైనా మూడు నిమిషాల్లో నటించేస్తారాయన. ‘కొల్లగొట్టినాదిరో..’ పాట పెద్ద సెట్‌లో  షూట్ చేశారు. ఈ పాట ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది” అని చెప్పింది.